న్యూఢిల్లీ, జూలై 28 : గత కొన్నేండ్లుగా క్రిప్టో కరెన్సీల్లో మదుపు చేసేవారు క్రమేణా పెరుగుతున్నారు. అయితే ఏటా ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్స్ దాఖలు చేయాలంటే మాత్రం వీరికి తిప్పలు తప్పడం లేదు. ఈ క్రమంలోనే భారతీయ క్రిప్టోకరెన్సీ ఎక్సేంజ్ వజీర్ఎక్స్.. ఓ ఉచిత పన్ను నివేదిక సాధనాన్ని తీసుకొచ్చింది. ఐటీఆర్ దాఖలుకు గడువు తేదీ దగ్గరపడుతున్న క్రమంలో క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టిన మదుపర్లకు ఊరటనిస్తూ ‘ట్యాక్స్లిస్ట్’ పేరిట ఫ్రీ క్రిప్టో ట్యాక్స్ రిపోర్టింగ్ వేదికను మంగళవారం పరిచయం చేసింది.
దీంతో ఇక రకరకాల క్రిప్టో ఎక్సేంజీలలో జరిపిన లావాదేవీలకు సంబంధించి సులువుగానే ఇన్వెస్టర్లు తమ పన్ను నివేదికలను ఈ టూల్ ద్వారా అందుకోవచ్చని వజీర్ఎక్స్ చెప్తున్నది. ఏ ఎక్సేంజ్ నుంచైనాసరే మదుపర్లు తమ లావాదేవీల చరిత్రలను ట్యాక్స్లిస్ట్ ప్లాట్‌ఫామ్‌పై అప్లోడ్ చేసి లాభాలు, నష్టాలు, చెల్లించాల్సిన పన్ను వివరాల నివేదికలను నిమిషాల్లో పొందవచ్చని ఈ సందర్భంగా వజీర్ఎక్స్ తెలిపింది. క్రిప్టో ట్యాక్స్ లెక్కింపును సులభతరం చేసేలా ఈ సాధనాన్ని డిజైన్ చేశామని, ట్యాక్స్లిస్ట్ దానంతటదే వర్చువల్ డిజిటల్ అసెట్ (వీడీఏ) సహా అన్నింటి లాభనష్టాలను అంచనా వేసి కచ్చితమైన రిపోర్టును ఇస్తుందన్నది.