సిటీబ్యూరో, నవంబర్ 25(నమస్తే తెలంగాణ): ‘జుట్టు, గడ్డాలు పెంచుకోవద్దు.. నల్ల బట్టలు వేయొద్దు.. దీక్షలు తీసుకోవాలనుకుంటే సెలవు పెట్టి వెళ్లిపోండి..’ ఇది నగర పోలీసుశాఖ అయ్యప్ప దీక్షాపరులైన పోలీసులకు జారీ చేసిన ఆదేశం. అయ్యప్ప దీక్షాసమయం కావడంతో నగరంలోని పలువురు పోలీసులు అయ్యప్పమాల ధరిస్తున్నారు. ఈసమయంలో నగర పోలీసు శాఖ మతపరమైన దీక్షలపై కఠిన ఆదేశాలు జారీ చేసింది. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ఉండి అయ్యప్పదీక్ష వంటి మతాచారాలు పాటించకూడదని ఆదేశించింది. ఎవరైనా దీక్షలో ఉంటే సెలవులు తీసుకోవాలని సూచించింది.
ఈ క్రమంలో డ్యూటీలో ఉండి అయ్యప్పమాల ధరించిన కంచన్‌బాగ్ ఎస్ఐ కృష్ణకాంత్‌కు అధికారులు మెమో జారీ చేశారు. మాలవేయడం, గడ్డం పెంచడం, పోలీసు బూట్లు లేకుండా దీక్ష చేపట్టడంపై వివరణ ఇవ్వాలని సౌత్ ఈస్ట్‌జోన్ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో పోలీసులకు కీలక సూచనలు చేశారు. మాల వేసుకునేవారు, వేసుకోవాలకున్నవారు శాఖాపరంగా అనుమతి తీసుకోవాలని, రెండు నెలలపాటు సెలవు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పోలీసులు గడ్డం, జుట్లు పెంచుకోవద్దని, తప్పనిసరిగా యూనిఫామ్ ధరించే విధులకు హాజరుకావాలని తెలిపింది.
పోలీసు సిబ్బంది షూస్ ధరించకుండా సివిల్ డ్రెస్సుల్లో విధులకు హాజరు కావద్దని ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం పోలీసు డిపార్ట్మెంట్లో చాలామంది అయ్యప్ప దీక్ష తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసుశాఖ ఇలాంటి వివాదాస్పదమైన ఆదేశాలు జారీచేయడం చర్చకు దారితీసింది. ఎస్ఐకి మెమో జారీ చేయడంపై అయ్యప్పస్వాములు సీరియస్ అయ్యారు. చట్టాలు అందరికీ సమానంగా ఉండాలని, ఒక్క హిందువులకే ఈ రకమైన చట్టాలు వర్తింపజేస్తారా? ఇతర మతస్తులకు వారివారి పండుగలు, దీక్షల సమయంలో ఈ నిబంధనలు వర్తించవా? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఇటువంటి నిబంధనలు లేవని అయ్యప్ప దీక్షాపరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.