మక్తల్, నవంబర్ 24 : రైతులకు న్యాయం చేయమని అడిగితే మాపై కేసులు నమోదు చేస్తారా..? అధికారం ఉంది కదా అని అధికారులతో అడ్డగోలు కేసులు పెట్టించడం తగదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మంత్రి వాకిటి శ్రీహరికి సూచించారు. సోమవారం మక్తల్‌లోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ గత వారం రోజుల కిందట జిన్నింగ్ మిల్ యజమానులు పత్తి కొనుగోలు చేయకుండా నిలిపివేయడం వల్ల, రైతుల పత్తి కొనుగోలు చేయాలని జాతీ య రహదారిపై నిరసన కార్యక్రమానికి దిగితే, రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై మంత్రి వాకిటి శ్రీహరి అధికారులతో కేసులు పెట్టించడం ఎంత వరకు సమంజసం అన్నారు.
అధికారంలో ఉండి రైతుల ఇబ్బందులను ఏ మాత్రం పట్టించుకోకుండా రైతులకు న్యాయం చేయమని అడిగిన మాపై కేసులు నమోదు చేస్తున్నారని, మీరు ఎన్ని కేసులైన నమోదు చేసుకోండి, దానికి భయపడే ప్రసక్తే లేదన్నా రు. మక్తల్ మున్సిపాలిటీలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద అద్భుతమైన రీతిలో పారు నిర్మాణం చేపట్టాలని, ట్యాంక్ బండ్ వద్ద చదును చేసిన స్థలంలో మంత్రి వాకిటి శ్రీహరి తన ఇష్టానుసారంగా సులభ్ కాంప్లెక్స్ నిర్మాణానికి పూనుకోవడం సరికాదన్నారు. మంత్రి సుందరీకరణలో భాగంగా చేపట్టిన పను ల విషయంపై మాట్లాడుతూ ఆడపిల్లలను గౌరవించాలని సోయిలేకుండా స్త్రీలను కించపరుస్తూ మాట్లాడటం సిగ్గు చేటన్నారు.
మక్తల్ నియోజకవర్గంలో అభివృద్ధికి ఎవరు అడ్డుపడలేదని, మినీ ట్యాంక్‌బండ్ వద్ద చేపట్టే నిర్మాణాలను ప్రజలకు ఉపయోగపడే నిర్మాణాలు చేపట్టాలని ప్రశ్నిస్తున్నాము తప్పా, ఎలాంటి అడ్డంకులు సృష్టించడం లేదన్నారు. మక్తల్ మున్సిపాలిటీలో ఉన్నటువంటి మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి చేయడం అందరికీ స్వాగతమేనని, పట్టణంలో ఎంతో భక్తిశ్రద్ధలతో చేపట్టే వినాయకుల విగ్రహాలు, బతుకమ్మల నిమజ్జన కార్యక్రమాలకు ట్యాంక్ బండ్ వద్ద స్థలం లేకుండా సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టడాన్ని ప్రశ్నిస్తున్నామని తప్పా అభివృద్ధిని కాదన్నారు.
ఈ విషయంలో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు. మక్తల్ నియోజకవర్గం నుంచి కొడంగల్‌కు నీటిని తీ సుకుపోయేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతులమీదుగా, పైలాన్ ప్రారంభిస్తామని చెప్పడం చూస్తుంటే, మంత్రికి మక్తల్ నియోజకవర్గం ఎడారి పాలు చేసే ఆలోచన ఉందని బహిర్గతం అవుతుందన్నారు. ఏది ఏమైనా మంత్రి హుందాగా వ్యవహరించాలని, అధికా రం ఉంది కదా అని అడ్డమైన కేసులు పెట్టి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను వేధించాలని చూస్తే ఇక్కడ భయపడేవారు లేరని తేల్చి చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చిన్న హనుమంతు, మాజీ కౌన్సిలర్ మొగులప్ప,, అన్వర్ హుస్సేన్, నాయకులు జుట్ల శంకర్, ఈశ్వర్‌యాదవ్ తదితరులు ఉన్నారు.