అలంపూర్ చౌరస్తా, నవంబర్ 17 : రైతులు ఎవరూ అధైర్య పడవద్దని మీకు అండగా ఉం టానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. సోమవారం ఉండవెల్లి మండలంలోని ఉండవల్లి స్టేజి సమీపంలో శ్రీవరసిద్ధి వినాయక కాటన్ మిల్లు లో సమ్మె కారణంగా పత్తి కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతులు ఆందోళన చేశారు. పత్తి కొనుగోలు కేంద్రం వద్ద రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సమాచారం రావడంతో ఎమ్మె ల్యే విజయుడు సాయంత్రం కాటన్ మిల్లు దగ్గరికి చేరుకుని రైతులతో మాట్లాడారు.
దీంతో ఆయన మార్కెటింగ్ అధికారులతో, జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి రైతుల సమస్యలను వివరించి కొనుగోలు చేసే విధంగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మె ఉంటే అధికారులు ముందస్తుగా రైతులు సమాచారం అందించాలని అలా కాకుండా మీ ఇష్టానుసారం నడుచుకుంటామంటే సరిపోదని హెచ్చరించారు. రోజుల తరబడి స్లాట్ బుక్ చేసుకుని పత్తిని అమ్ముకుందామని ఇక్కడికి వస్తే సమ్మె పేరుతో రైతులను ఇబ్బందులు పెడితే ఎలా అని అధికారులను ప్రశ్నించారు.
సమ్మె ఉందని ముందే రైతులకు సమాచారం ఇస్తే రైతులు ఇక్కడి వచ్చి ఇబ్బందులు పడరని అన్నారు. తేమ శా తం అంటూ, సమ్మెలంటూ ప్రతి నిత్యం రైతులను ప్రభుత్వం, అధికారులు వేధిస్తున్నారని ఇది సరైన పద్ధతి కాదని రైతులను ఇబ్బందులు పెడితే సహించే ప్రసక్తే లేదని అధికారులను హెచ్చరించారు. అనంతరం దగ్గరుండి మిల్లులోకి తీసుకెళ్లి కొనుగోలు చేయించారు. పత్తిని కొనుగోలు చేయడంతో ఎమ్మెల్యేకి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మార్కెటింగ్ అధికారి పుష్పమ్మ, గజేందర్రెడ్డి, గోపాల్, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.