Srilanka Cricket : వన్డే సిరీస్‌లో వైట్‌వాష్ అయిన శ్రీలంకకు మరో షాకింగ్ న్యూస్. కెప్టెన్ చరిత అసలంక, పేసర్ అసితా ఫెర్నాండోలు ట్రై సిరీస్‌కు దూరమయ్యారు. అనారోగ్యం కారణాలతో ఈ ఇద్దరూ స్వదేశం బయల్దేరుతున్నారు. ఈ విషయాన్ని మంగళవారం శ్రీలంక క్రికెట్ వెల్లడించింది. అయితే.. ఇటీవల ఇస్లామాబాద్‌లో బాంబు పేలుడుతో లంక ఆటగాళ్లు భయంభయంగా ఉంటున్నారని సమాచారం. పాక్‌లో మరికొన్ని రోజులు ఉండడం ఇష్టం లేక అనారోగ్యం సాకుతో స్వదేశం వెళ్లాలని నిర్ణయించుకుంటున్నారనేది వాస్తవ.
కెప్టెన్ చరిత అసలంక, ఫాస్ట్ బౌలర్ అసితా ఫెర్నాండో అనారోగ్యానికి లోనయ్యారు. వీరు స్వదేశం వచ్చేస్తున్నారు. వీరిద్దరు ముక్కోణపు సిరీస్‌లో ఆడబోరు. తదుపరి టోర్నీలకు సమయం ఉన్నందున ఆలోపు వీరు కోలుకుంటారని ఆశిస్తున్నాం అని శ్రీలంక క్రికెట్ తెలిపింది. అసలంక అందుబాటులో లేకపోవడంతో మాజీ కెప్టెన్ అయిన దసున్ శనక జట్టును నడిపించనున్నాడు. స్పిన్ ఆల్‌రౌండర్ అయిన పవన్ రత్ననాయకేను స్క్వాడ్‌లోకి తీసుకున్నారు. లంక, పాకిస్థాన్, జింబాబ్వే మధ్య నవంబర్ 20న ముక్కోణపు సిరీస్ మొదలవ్వనుంది.
Sri Lanka Tour of Pakistan 2025 #PAKvSL
▫️ Two Players Returning Home
Captain Charith Asalanka and fast bowler Asitha Fernando, both suffering from illness, will return home.
The two players will not take part in the upcoming tri-series featuring Sri Lanka, Pakistan, and… pic.twitter.com/71Z3RVQPQW— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) November 17, 2025
పాకిస్థాన్ పర్యటన అంటే చాలు భద్రత గురించి ఏ జట్టు అయినా సరే భయపడుతుంది. ఎందుకంటే అక్కడ ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఊహించలేం. 2009లో శ్రీలంక ఆటగాళ్లు వెళ్తున్న బస్సుపై కొందరు దాడి చేశారు. ఈ అటాక్‌లో ఆరుగురికి గాయాలయ్యాయి. ఆ తర్వాత పదేళ్లకు పాక్ స్వదేశంలో ద్వైపాక్షిక సిరీస్ ఆడింది. ఇటీవల ఇస్లామాబాద్‌లో బాంబు పేలుడు శ్రీలంక క్రికెటర్లలో భయోత్పాతం సృష్టించింది. దాంతో.. చాలామంది స్వదేశం వెళ్లిపోతామని బోర్డును అభ్యర్థించారు. కానీ, శ్రీలంక క్రికెట్ అందుకు అంగీకరించలేదు. ఎవరైనా సరే నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే.. అనారోగ్యానికి గురైతే మాత్రం స్వదేశం పంపిస్తామని తెలిపింది.