ముషీరాబాద్, మార్చి 9 : మాదిగ ఉద్యోగులు మీటింగ్ పెట్టుకుంటే ఓర్వలేక వారిపై అనుచిత వాఖ్యలు చేసిన మంద కృష్ణకు 17 ఏండ్ల తరువాత అమరవీరులు గుర్తు కువచ్చారా అని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మండిపడ్డారు. ఉద్యోగుల సమావేశంలో ప్రొఫెసర్ కాశీం అమరవీరుల గురించి మాట్లాడిన తరువాత మంద కృష్ణకు గుర్తుకు రావడం శోచనీయని, ఏనాడు అమరుల పేరెత్తిన పాపాన పోలేదని విమర్శించారు.
సోమవారం విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ కాశీం విలువలు కలిగిన వారని ఆయనపై మంద కృష్ణ తన భజన పరులతో విమర్శలు చేయించడం తగదన్నారు. ఉద్యోగులు పెట్టిన మీటింగ్ దెబ్బకు అమరుల కుటుంబాల వద్దకు పరుగులు తీశారని అన్నారు. లక్షల మంది చేసిన పోరాటాలను సొంత ఖాతాలో వేసుకున్నారని, బీజేపీకి అమ్ముడుపోయి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
అమరులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వచ్చిన తరువాత తామే అమరులను గుర్తించి మాజీ సీఎం కేసీఆర్తో 14 కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించిన చరిత్ర తెలంగాణ ఎమ్మార్పీఎస్దే అన్నారు. మోదీకి దగ్గర ఉన్నానని చెప్పుకునే మంద కృష్ణ పార్లమెంటులో వర్గీకరణ బిల్లు ఎందుకు పెట్టించ లేకపోతున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎమ్మర్పీఎస్ నాయకులు ఎంఎస్ఎఫ్ అధ్యక్షుడు కొల్లూరి వెంకటేశ్, శాంతికిరణ్, వరిగడ్డి చందు, శ్యామ్రావు, సురేశ్, శ్యామ్సుందర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.