ఖమ్మం సిటీ, మార్చి 9: ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో నివాసాలు నిర్మించుకున్న పేదలను ప్రభుత్వం పక్కకు పడేసినా.. పువ్వాడ ఫౌండేషన్ అక్కున చేర్చుకుంది. కర్కశంగా వ్యవహరించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పేదల ఇళ్లను నిలువునా కూల్చి నిలువ నీడ లేకుండా చేసింది. ఇళ్ల కూల్చివేతల్లో కొద్దోగొప్పో సామాన్లు బయటకు తెచ్చుకున్న నిరుపేదలు వాటిని కాపాడుకుంటూ ఖమ్మం టీటీడీసీ, అంబేద్కర్ భవనాల్లో పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
అయితే, వారిని అక్కడ పడేసిన ప్రభుత్వం.. ఆ తరువాత పట్టించుకోకపోవడంతో వారంతా ఆకలితో అలమటిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర.. కొన్నాళ్లపాటు ఆ అభాగ్యులకు భోజన వసతిని కల్పించారు. ఆ తరువాత మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కూడా తమ పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత పది రోజులుగా పునరావాస కేంద్రాల్లోని నిరాశ్రయులకు రోజుకు రెండు పూటలా భోజనాన్ని ఏర్పాటుచేశారు. బీఆర్ఎస్ నాయకులు రోజూ వచ్చి బాధితుల కడుపునిండా భోజనం వడ్డిస్తున్నారు. సోమవారం కూడా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో నిరాశ్రయులకు అన్నదానం చేశారు. అలాగే, పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ పునరావాస కేంద్రంలోని నిరుపేదలకు వైద్య శిబిరాన్ని కూడా కొనసాగిస్తోంది. 24 గంటలూ మంచినీటి సౌకర్యాన్ని ఏర్పాటుచేసింది.
సోమవారం నాటి అన్నదాన కార్యక్రమాన్ని మమత సంస్థల డైరెక్టర్ పువ్వాడ నరేన్రాజ్ ప్రారంభించారు. బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు పగడాల నాగరాజు, బచ్చు విజయ్‌కుమార్, దండా జ్యోతిరెడ్డి, షకీనా, ఆరెంపుల వీరభద్రం, వీరేందర్ గౌడ్, వెంకట్, ఉస్మాన్, తోడేటి లింగరాజు, తీగల సతీశ్‌గౌడ్, తిరుమల్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కాగా, పువ్వాడ ఫౌండేషన్ సమకూర్చిన భోజనంతో ఆ పునరావాస కేంద్రంలోని నిరుపేదలు కడుపునింపుకుంటున్నారు. కొందరు మాతృమూర్తులు ఈ భోజనాన్ని తీసుకెళ్లి తన చిన్నారులకు తినిపిస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి.
