కోస్గి, నవంబర్ 16 : రేకులకుంట చెరువు భూమిపై వివాదం రాజుకుంటుంది. ప్రభుత్వ భూమిని అక్రమంగా తాసీల్దార్ రిజిస్ట్రేషన్ చేశారని రైతులు వాదిస్తుండగా అది ఏ మాత్రం కాదని అన్ని రికార్డుల ప్రకారమే చేశానంటూ తాసీల్దార్ శ్రీనివాసులు అంటున్నారు. సక్రమ రిజిస్ట్రేషన్ చేసినట్టయితే ఇరిగేషన్ శాఖ అధికారులు వచ్చినప్పుడు తాసీల్దార్ ఎందుకు రాలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీనికి మాత్రం ఇప్పటి వరకు తాసీల్దార్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఇరిగేషన్ శాఖ అదికారులు సర్వే చేస్తున్న సమయంలో ఒక్క రెవెన్యూ సిబ్బంది కూడా అక్కడికి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. బుధవారం కోర్టు పనికారణంగా అక్కడికి రాలేనని చెప్పిన తాసీల్దార్ శ్రీనివాసులు గురువారం ఇరిగేషన్ అధికారులు వచ్చిన ఎందుకు స్పందించలేదో సమాధానం చెప్పాలని అక్కడి ప్రజలు డిమాండ్ చెస్తున్నారు.
ఈ ఏడాది మే నెలలో ఇదే సర్వే నెంబర్ 466లో తమ కుటుంబానికి పార్టీషన్ చెయ్యాలని స్లాట్ బుక్ చేసిన సదరు సర్వే నెంబర్ ప్రభుత్వ భూమి అని వారిని తిప్పి పంపించినట్టు ఆ రైతులు తెలిపారు. కానీ అదే సర్వే నెంబర్లో 466/3/2/2 లో ఒక ఎకరాను ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడంతో వివాదం మొదలయ్యింది. ఇక అది ప్రభుత్వ భూమి అని అట్టి భూమిని ప్రభుత్వం 1990 సంవత్సరంలో మొత్తం 19-35 ఎకరాల భూమిని ఇరిగేషన్‌శాఖకు అప్పగించిందని గురువారం ఆ శాఖ డీఈ ఆనంద్ కిశోర్ తెలిపారు. ఇరిగేషన్ శాఖ అ ధికారులు చెరువు భూమి ఆక్రమణపై హద్దులు చేస్తున్నప్పుడు ఆ భూ మి మొత్తంలో సగభాగం వ్యవసాయం చేస్తున్నట్టు గుర్తించారు. ఇంత జరిగిన తాసీల్దార్ శ్రీనివాసులు మాత్రం అంతా రికార్డుల ప్రకారమే చేశానని కొన్ని పత్రికలు కావాలనే తప్పుడు వార్తలు రాసాయంటూ తన అక్కసు వెల్లగక్కారు.
కానీ రైతులు మాత్రం ఇందుకు భిన్నంగా మాట్లాడుతూ తాసీల్దార్ తీరుపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి తాసీల్దార్ శ్రీనివాసులు ఒక్కసారి కూడా రాలేదని ఏ భూమి ఎవరిదో అతనికి ఎలా తెలుసని వారు ప్రశ్నించారు. నిజంగా రిజిస్టర్ అయిన భూమి చెరువుకు అప్పగించినది కాకుంటే స్వయానా తాసీల్దార్ తన సిబ్బందితో వచ్చి చూపించాలని మహిళలు డిమాండ్ చేశారు. తమ గ్రామం నీటితో కలకలాడుతుందని అక్కడ చెరువు నిర్మిస్తే రైతన్నలు ఆనందంగా ఉంటారని ఆశించి తమ భూములను ఇచ్చామని, అంతేకాని ఇలా అక్రమంగా దోచుకోడానికి కాదని వాపోతున్నారు. ఇక ఈ తతంగం మొత్తం ఓ కాంగ్రెస్ నాయకుడి కనుసన్నల్లో జరుగుతుందని అక్కడి ప్రజల టాక్‌గా వినిపిస్తోంది. ఇన్నాళ్లు ఆ భూములను అన్యాక్రాంతం కాకుం డా కాపాడిన ఆ నేతనే ఇప్పుడు ఆ భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌కు సహకరించాడని గుసగుసలాడుకుంటున్నారు. ఇకనైనా ఇలాంటి ఆక్రమణ లు జరగకుండా వెంటనే హద్దులు పాతిన భూముల్లో చెరువు నిర్మాణ పనులను ప్రారంభించాలని ముక్త కంఠంతో రైతులు కోరుతున్నారు.
రేకులకుంట చెరువు భూమి అన్యాక్రాంతం అవుతుందన్న రైతుల ఆవేదనను ప్రచురించిన ‘నమస్తే తెలంగాణ’పై తాసీల్దార్ శ్రీనివాసులు తన అక్కసును వెల్లగక్కారు. దీనికి తోడు ఓ చానెల్ సైతం వంత పాడింది. రైతుల పక్షాన నిలబడాల్సిన చానెల్ ప్రతినిది కొందరికి తలొగ్గి పత్రికపై తన అక్కసును వెల్లగక్కింది. ఇలాంటి వ్యతిరేక ప్రచారాలు చేస్తే తమ గ్రామానికి వచ్చే వారికి తగిన గుణపాఠం చెప్తామని గ్రామస్తులు అంటున్నారు.