Monalisa Bhonsle | గతేడాది ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళాలో పూసలు అమ్ముతూ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన మోనాలిసా భోంస్లే ఇటీవల వివాహా బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. కేరళలోని తిరువనంతపురం, నేమం సమీపంలో ఉన్న అరుమనూర్ శ్రీ నైనార్ దేవా ఆలయంలో తన ప్రియుడు, మహారాష్ట్రకు చెందిన నటుడు ఫర్మాన్ ఖాన్‌ను ఆమె హిందూ సంప్రదాయాల ప్రకారం వివాహం చేసుకున్నారు. గత ఆరు నెలలుగా వీరిద్దరి మధ్య ఉన్న పరిచయం కాస్తా పెళ్లికి దారితీసింది. అయితే ఈ వివాహంపై అనేక విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మోనాలిసా ఘాటుగా స్పందించారు. తన పెళ్లిని ‘లవ్ జిహాద్’ అని ముద్ర వేయవద్దని, తాను మనస్ఫూర్తిగా హిందూ ఆచారాల ప్రకారమే వివాహం చేసుకున్నానని ఆమె స్పష్టం చేశారు. తనకు అన్ని మతాల పట్ల సమాన గౌరవం ఉందని, ఒక మేజర్‌గా తనకిష్టమైన వ్యక్తిని ఎంచుకునే హక్కు తనకు ఉందని ఆమె ఈ సందర్భంగా మీడియాతో పేర్కొంది.
మరోవైపు ఈ వివాహం తీవ్ర వివాదాలకు కూడా దారితీసింది. మోనాలిసా తండ్రి విజయ్ సింగ్ భోంస్లే ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా, ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీనితో భద్రత నిమిత్తం మోనాలిసా కేరళ పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చింది. అలాగే ఆమెను సినీ రంగానికి పరిచయం చేసిన దర్శకుడు సనోజ్ మిశ్రా సైతం దీనిని ‘లవ్ జిహాద్’ అని అభివర్ణించగా.. కేరళలోని అధికార పార్టీ సిపిఎం నేతలు మాత్రం ఈ జంటకు మద్దతుగా నిలిచారు. మంత్రి వి. శివన్కుట్టి, ఎంపి ఏ.ఏ. రహీమ్ వంటి ప్రముఖులు వివాహానికి హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం మోనాలిసా మలయాళంలో ‘నాగమ్మ’, బాలీవుడ్లో ‘ది డైరీ ఆఫ్ మణిపూర్’ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.