Sourav Ganguly : భారత్‌లో టెస్టు మ్యాచ్‌లకు కొన్ని మైదానాలు కేరాఫ్. ప్రతి సిరీస్‌లో కచ్చితంగా ఆయా స్టేడియాల్లో మ్యాచ్‌లు ఉండేలా భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) షెడ్యూల్ ప్రకటిస్తుంది. ఈ లెక్కన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ ఉండి తీరుతుంది. అయితే.. ఈసారి 2026-27 షెడ్యూల్లో ఈడెన్‌ను కాదని మిగతా వేదికలకు మ్యాచ్‌లు కేటాయించింది బీసీసీఐ. దాంతో, ఈ విషయంపై రగడ మొదలైంది. అయితే.. ఈ అంశంపై బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ(Sourav Ganguly) మాత్రం సానుకూలంగా స్పందించాడు.
టెస్టు క్రికెట్‌ను మరిన్ని మైదానాలకు విస్తరించాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే 2026-27 సీజన్లో భారత జట్టు ఐదు టెస్టులు ఆడనుంది. ఆశ్చర్యంగా వాంఖడే స్టేడియం(ముంబై), ఈడెన్ గార్డెన్స్(కోల్‌కతా)లు మాత్రం వేదికలుగా ఎంపికవ్వలేదు. దాంతో, ఘన చరిత్ర కలిగిన ఈ రెండు మైదానాల్లో మ్యాచ్‌లు ఆడించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. టెస్టు మ్యాచ్‌లను మిగతా వేదికల్లో జరపడం శుభపరిణామం అని క్యాబ్ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు.
#Cricket | Sourav Ganguly Breaks Silence After Eden Gardens Misses Out On 2027 Border-Gavaskar Tests https://t.co/Y8LWfaSS1X
— NDTV Profit (@NDTVProfitIndia) March 31, 2026
‘ఈడెన్ గార్డెన్స్‌లో పెద్ద టెస్ట్ మ్యాచ్‌లు జరగడం గొప్పగా అనిపిస్తుంది. మాజీ ఆటగాడిగా, బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఈ మైదానంలో మ్యాచ్‌లు నిర్వహించడానికి ప్రయత్నిస్తా. అయితే.. దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచ్, ఆపై టీ20 ప్రపంచకప్, ఇప్పుడు ఐపీఎల్ మ్యాచ్‌లు ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్నాయి. ఈడెన్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడించాలని నేను అనుకుంటాను. కానీ, అదే సమయంలో ఇతర మైదానాల్లో కూడా మ్యాచ్‌లు జరగాలిగా’ అని గంగూలీ పేర్కొన్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో భారత్, ఆస్ట్రేలియా ఐదు టెస్టులు ఆడనున్నాయి. జనవరి 21 నుంచి మొదలయ్యే ఈ సిరీస్ మ్యాచ్‌లను నాగ్‌పూర్, చెన్నై, గువాహటి, రాంచీ, అహ్మదాబాద్‌లో నిర్వహించనున్నారు.