బన్సీలాల్‌పేట్, మార్చి 31 : గాంధీ దవాఖానలో ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. సికింద్రాబాద్‌లోని వారాసిగూడకు చెందిన 43 ఏండ్ల మహిళ కడుపు నొప్పి, కడుపు ఉబ్బరం సమస్యతో బాధపడుతూ గాంధీ దవాఖానలో చేరింది. వైద్యులు పలురకాల పరీక్షలు నిర్వహించి ఆమె కడుపు కింది భాగంలో 45 x 20 సెంటిమీటర్ల సైజులో 2.8 కిలోల బరువు గల ప్లీహము ఉన్నట్టు గుర్తించారు. అది సాధారణం కన్నా పెద్ద పరిమాణంలో ఉండడం, రక్తకణాలు, ప్లేట్ లెట్స్ చాలా తక్కువగా ఉండడం వలన ఆపరేషన్ చేయడం వైద్యులకు పెద్ద సవాల్‌గా మారిందని దవాఖాన డిప్యూటి సూపరింటెండెంట్, సర్జరీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ కే.సునీల్ కుమార్ తెలిపారు.
సర్జరీ విభాగం డాక్టర్లతో పాటు, అనస్థీషియా విభాగం ప్రొఫెసర్ డాక్టర్ ఎ.మురళీధర్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం సమిష్టి కృషి చేసి, ఆ మహిళ కడుపులో నుండి కణితిని విజయవంతంగా తొలగించడం జరిగిందని, ప్రస్తుతం రోగి కోలుకున్నదని, సాధారణ స్థితికి చేరుకున్నదని ఆయన అన్నారు. వైద్యులను అదనపు డీఎంఈ డాక్టర్ ఎన్.వాణి, ఇన్చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ శోభ, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర అభినందించారు.