అశ్వారావుపేట, ఆగస్టు 3 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అధ్వాన్నంగా తయారైందని, అన్నివర్గాల ప్రజలు, రైతుల సంక్షేమాన్ని విస్మరించిందని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. అశ్వారావుపేట మండలంలో సోమవారం ఆయన విస్తృతంగా పర్యటించారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పెదవాగు ప్రాజెక్టును సందర్శించి ప్రస్తుత పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా విలేకరులతో ఆయన మాట్లాడుతూ వ్యవసాయరంగం, అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసిందని అసహనం వ్యక్తంచేశారు. పెదవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయి రెండేళ్లు అయినా పునరుద్ధరించేందుకు కనీస చర్యలు చేపట్టకపోవటం ఇందుకు నిదర్శనమన్నారు. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల సరిహద్దు గ్రామాల రైతులకు సాగునీరు అందించే ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయటం వల్ల దళిత, గిరిజన చిన్న, సన్నకారు రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గండిపడి తెగిపోయిన ప్రాజెక్టును పునరుద్ధరించటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ ప్రాజెక్టును పునరుద్ధరించకపోవటం అత్యంత దురదృష్టకరమన్నారు.
కమీషన్ల కోసం రూ.3.5 కోట్లతో రింగ్బండ నిర్మించారని, దీనివల్ల రైతులకు పైసా ప్రయోజనంలేదని విమర్శించారు. పెదవాగు ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం రైతులు ఎన్నిసార్లు విన్నవించినా అధికారులు, ప్రజాప్రతినిధులు కనికరించటం లేదని అసంతృప్తిని వెలిబుచ్చారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తక్షణమే ప్రాజెక్టును పునరుద్ధరించాలని, లేకుంటే రైతులతో కలిసి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆయన వెంట నాయకులు కాసాని నాగశేష పద్మ, చంద్రమోహన్, డాక్టర్ భూక్యా ప్రసాదరావు, సత్యవరపు సంపూర్ణ, అంకత మల్లికార్జునరావు, పొట్టా రాజులు, సంగీతం వీర్రాజు, జే.శ్రీరామమూర్తి, తగరం జగన్నాధం, చిన్నబ్బాయి, బైటా రాజేష్, జ్యోత్స్నాబాయి తదితరులు ఉన్నారు.