Indian Vessels : ఇరాన్ యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధి వద్ద చమురు రవాణా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వివిధ దేశాలకు చెందిన నౌకల్ని ఇరాన్ ఆపేసింది. అందులో ఇండియాకు చెందిన నౌకలు కూడా ఉన్నాయి. అయితే, తాజాగా ఇండియన్ నౌకలు వెళ్లేందుకు ఇరాన్ అంగీకరించింది. ఇండియా-ఇరాన్ మధ్య జరిగిన దౌత్య చర్చల తర్వాత ఇండియన్ నౌకలు హోర్ముజ్ జలసంధి నుంచి వెళ్లేందుకు ఇరాన్ అనుమతించింది.
దీంతో పుష్పక్, పరిమల్ అనే రెండు వాహనాలు ఈ జలసంధి నుంచి ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించినట్లు తెలుస్తోంది. మిగతా భారత నౌకలు కూడా జలసంధి నుంచి ఇండియా వచ్చే అవకాశం ఉంది. ఇది ఇండియాకు చాలా ఉపశమనం కలిగించే అంశం. ఇప్పటికే ఈ మార్గంలో ఆంక్షల కారణంగా ఇండియాకు చమురు, ఫెర్టిలైజర్స్, కొన్ని రకాల ఆహార పదార్థాలు నిలిచిపోయాయి. దీంతో ఇండియాలో ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్.. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చితో మాట్లాడారు. ఇండియన్ నౌకలకు అనుమతించాల్సిందిగా కోరారు. దీనికి అంగీకరించిన ఇరాన్ భారత నౌకల్ని అనుమతించింది. అయితే, ఇప్పటికీ అమెరికా, ఇజ్రాయెల్, యురోపియన్ యూనియన్ దేశాలకు సంబంధించిన నౌకలు, వారి మిత్ర దేశాలకు సంబంధించిన నౌకల్ని మాత్రం అనుమతించడం లేదు.
మరోవైపు సౌదీ అరేబియా నుంచి బయల్దేరిన లిబేరియన్ నౌక ముంబై పోర్టుకు చేరుకుంది. ఇరాన్-ఇజ్రాయెల్ వార్ తర్వాత ఒక నౌక విజయవంతంగా ఇండియా చేరడం ఇదే మొదటివసారి. ఇరాన్ ఆధీనంలో ఉన్న హోర్ముజ్ జలసంధి ద్వారా నౌకలు వెళ్లాలంటే తమ అనుమతి తప్పనిసరి అని ఇరాన్ హెచ్చరించింది. ఈ మార్గంలో నిలిచిపోవడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి.