Smart Phone | టాయిలెట్లో కూర్చుని మొబైల్లో స్క్రోల్ చేయడం ఇప్పుడు చాలా మందికి అలవాటుగా మారిందని చెప్పవచ్చు. పెద్దలలో సుమారు 66% మంది టాయిలెట్లో కూర్చుని వార్తలు చూడటం లేదా సోషల్ మీడియా బ్రౌజ్ చేయడం చేస్తూ ఉంటారు. ఈ ఆధునిక అలవాటు కారణంగా చాలా మంది టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చుంటున్నారు. ఇది వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎక్కువసేపు కూర్చుని మొబైల్ ఉపయోగించడం వల్ల పెద్దప్రేగు దగ్గర ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోయి పైల్స్ (హెమరాయిడ్స్) సమస్య వచ్చే అవకాశం ఉందని ఇవి అంతర్గతంగా లేదా బయట వైపు కూడా రావచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. మన దేశంలో సుమారు 4 కోట్ల మందికి పైగా పైల్స్ సమస్యతో బాధపడుతున్నారు. ప్రతి సంవత్సరం సుమారు 10 లక్షల కేసులు కొత్తగా గుర్తించబడుతున్నాయి.
పైల్స్ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుందని, టాయిలెట్ లో ఎక్కువ సమయం కూర్చోవడం కూడా ఇందుకు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. అసలు టాయిలెట్లో కూర్చుని ఎక్కువ సమయం మొబైల్ వాడటం వల్ల పైల్స్ ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. Public Library of Science One లో ప్రచురితమైన ఒక కొత్త అధ్యయనం ప్రకారం, టాయిలెట్లో మొబైల్ స్క్రోల్ చేయడం వల్ల పైల్స్ వచ్చే ప్రమాదం 46% వరకు పెరుగుతుంది. దీని వల్ల నొప్పి, దురద, రక్తస్రావం కూడా రావచ్చు. హెమరాయిడ్స్ అనేవి పెద్దప్రేగు లేదా మలద్వారం వద్ద ఉన్న రక్తనాళాలు ఉబ్బిపోవడం వల్ల వస్తాయి. టాయిలెట్లో ఎక్కువసేపు కూర్చోవడం వల్ల మలద్వారం దగ్గర ఒత్తిడి ఎక్కువగా పడుతుంది. దీని వల్ల అక్కడి రక్తనాళాలు విస్తరించి ఉబ్బిపోతాయి. కనెక్టివ్ టిష్యూ బలహీనపడుతుంది. మొబైల్ వాడటం వల్ల తెలియకుండా ఎక్కువ సమయం టాయిలెట్లో కూర్చుంటారు. దీని వల్ల మలద్వారంపై ఒత్తిడి పడి పైల్స్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అంతేకాకుండా టాయిలెట్లో కూర్చొని మొబైల్ వాడటం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
పరిశోధనల ప్రకారం సుమారు 37% మంది ఒకసారి టాయిలెట్‌కు వెళ్లినప్పుడు 5 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చుంటారు. మొబైల్ వాడని వారిలో 7.1% మాత్రమే అంతసేపు కూర్చుంటారు. కనుక 5 నిమిషాల నియమం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే టాయిలెట్లో 5 నిమిషాల లోపే పని ముగించుకోవాలి. ఇలా 5 నిమిషాల నియమాన్ని పాటించడం వల్ల పెల్విక్ ఫ్లోర్ కండరాలు సహజంగా పనిచేస్తాయి. మల విసర్జన సులభంగా జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా టాయిలెట్ స్క్రోలింగ్ వెనుక మానసిక కారణాలు కూడా ఉంటాయని వారు తెలియజేస్తున్నారు. COVID-19 తర్వాత చాలా మంది మొబైల్‌పై ఎక్కువగా ఆధారపడటం ప్రారంభించారు. దీని వల్ల మొబైల్ లేకపోతే భయంగా ఉండడం, అలవాటుగా ఎక్కడికి వెళ్లినా మొబైల్ ను తీసుకెళ్లడం, మొబైల్ చూస్తూ ఒత్తిడిని తగ్గించుకోవాలని అనుకోవడం, నిద్ర నాణ్యత తగ్గిపోవడం వంటి మానసిక లక్షణాలు చాలా మందిలో కనిపిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక పైల్స్ ప్రమాదాన్ని తగ్గించే కొన్ని సూచనలను కూడా నిపుణులు తెలియజేస్తున్నారు. పైల్స్ చాలా బాధాకరమైన సమస్య. ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే 5 నిమిషాల నియమాన్ని పాటించాలి. టాయిలెట్‌కు మొబైల్ ను తీసుకెళ్లకూడదు. రోజూ నియమిత వ్యాయామం చేయాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. నీటిని ఎక్కువగా తాగాలి. టాయిలెట్లో మొబైల్ స్క్రోల్ చేయడం వల్ల పైల్స్ వచ్చే ప్రమాదం 46% పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి కనుక ఈ అలవాటు మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.