Ranbir Kapoor | బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పౌరాణిక చిత్రం ‘రామాయణం’ (Ramayana) ట్రైలర్ విడుదలై సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న సంగతి తెలిసిందే. నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ లంకాధీశుడు రావణాసురుడిగా నటిస్తున్నారు. దాదాపు నాలుగు నిమిషాలకు పైగా ఉన్న ఈ ట్రైలర్ విజువల్స్, గ్రాఫిక్స్ పరంగా అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు అందుకుంటుంది.
అయితే ఈ క్రమంలోనే ట్రైలర్లో కనిపించిన ఒక కీలక సన్నివేశం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని, శ్రీరాముడి పాత్రతో పాటు విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరశురాముడి పాత్రలోనూ ఆయనే కనిపించనున్నారని తేలింది. ట్రైలర్‌లోని ఒక వైరల్ సన్నివేశంలో పరశురాముడు శ్రీరాముడి ముందు మోకరిల్లి విష్ణువు దివ్య ధనుస్సు అయిన ‘శారంగ’ను సమర్పిస్తున్నట్లు ఉంది. ఈ సన్యాసి లాంటి పాత్రలో రణ్‌బీర్ కపూర్ గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. హిందూ పురాణాల ప్రకారం పరశురాముడు చిరంజీవిగా భావించబడే మహా యోగి. రామాయణంలో సీతారాముల వివాహం తర్వాత అయోధ్యకు వెళ్లే మార్గంలో రాముడిని సవాలు చేసే పరశురాముడు, ఆ తర్వాత రాముడిని విష్ణువు అవతారంగా గుర్తించి తపస్సు కోసం వెళతాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన లుక్‌ను ట్రైలర్‌ను చూసేయండి.
దాదాపు రూ. 4,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ ప్రపంచ స్థాయి చిత్రానికి నామిత్ మల్హోత్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఏఆర్ రెహమాన్, ఆస్కార్ విజేత హాన్స్ జిమ్మర్ మొట్టమొదటిసారిగా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం మొదటి భాగం అక్టోబర్ 2026లో దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండగా, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.