Ramayana | భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మైథలాజికల్ విజువల్ ఎపిక్ ‘రామాయణ’ ట్రైలర్ విడుదలై సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దర్శకుడు నితీష్ తివారీ రూపొందిస్తున్న ఈ భారీ చిత్రంలో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా కనిపిస్తూ తమ లుక్స్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. అద్భుతమైన విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గ్రాండియర్‌తో ట్రైలర్‌కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ట్రైలర్ విడుదలైన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో మరో అంశం హాట్ టాపిక్‌గా మారింది. అదే హనుమంతుడి పాత్ర ట్రైలర్లో కనిపించకపోవడం.
ట్రైలర్లో దశరథుడు, కైకేయి, విశ్వామిత్రుడు, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, శూర్పణఖ, రావణుడు వంటి కీలక పాత్రలను మేకర్స్ పరిచయం చేశారు. అయితే రామాయణంలో అత్యంత కీలకమైన పాత్రల్లో ఒకటైన హనుమంతుడిని మాత్రం పూర్తిగా గోప్యంగా ఉంచారు. దీంతో సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రియులు వరుస ప్రశ్నలు సంధిస్తున్నారు. హనుమంతుడు లేకుండా రామాయణ ట్రైలర్ ఎలా? , “అత్యంత ముఖ్యమైన పాత్రను ఎందుకు దాచిపెట్టారు?”, “కనీసం ఒక చిన్న గ్లింప్స్ అయినా చూపించి ఉంటే బాగుండేది” అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘రామాయణ’ను రెండు భాగాలుగా విడుదల చేయనున్న నేపథ్యంలో మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మొదటి భాగంలో శ్రీరాముడి జననం, విశ్వామిత్రుడితో ప్రయాణం, శివధనుస్సు విరిచిన ఘట్టం, సీతారాముల వివాహం, కైకేయి వరాల కారణంగా వనవాసం, అరణ్యవాసం, శూర్పణఖ ఘట్టం, రావణుడి ప్రతీకార ప్రతిజ్ఞ వరకు కథ సాగనున్నట్లు సమాచారం. ఇక రెండో భాగంలో సీతాపహరణం, హనుమంతుడి ప్రవేశం, లంక దహనం, వానరసేనతో శ్రీరాముడి యుద్ధం, రావణ సంహారం వంటి ప్రధాన ఘట్టాలు ఉండనున్నాయని ప్రచారం జరుగుతోంది. అందుకే హనుమంతుడి పాత్రను ఇప్పుడే రివీల్ చేయకుండా సస్పెన్స్‌గా ఉంచినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రను పోషిస్తున్నారు. ఆయన లుక్‌ను ఇప్పటివరకు చిత్రబృందం ఎక్కడా విడుదల చేయకపోవడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ట్రైలర్లో కనిపించకపోయినా, త్వరలో ప్రత్యేక పోస్టర్ లేదా క్యారెక్టర్ గ్లింప్స్ విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి మొత్తంగా చూస్తే ‘రామాయణ’ ట్రైలర్ విజువల్స్, పాత్రల రూపకల్పన, సంగీతం, నిర్మాణ విలువలతో అంచనాలను మరింత పెంచింది.