Kunamneni Sambasiva Rao | ఇవాళ పాల్వంచలోని చండ్ర రాజేశ్వరరావు భవన్లో జరిగిన దళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్పీఎస్) జిల్లా మహాసభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళితుల సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులను కేటాయించడంతోపాటు దళితులపై దేశవ్యాప్తంగా నిత్యం జరుగుతున్న దాడులను అరికట్టేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.
కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన తర్వాత దళిత సంక్షేమానికి నిధుల కోత విధించడంతోపాటు దాడులు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ భద్రత, దళితుల భద్రత, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, జనాభాకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు, ప్రమోషన్లలో రిజర్వేషన్లు, అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలకు సన్నద్ధం కావాలన్నారు.
దీర్ఘకాలిక సామాజిక ఉద్యమం ద్వారానే దళితులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను సాధించుకోగలుగుతామని తెలిపారు. దళిత కుటుంబాలు పరిమిత విద్య ద్వారా కొన్ని ఉద్యోగాలను పొందగలుగుతుండగా, ప్రభుత్వరంగ సంస్థలను ప్రభుత్వం ప్రైవేటీకరించడం ద్వారా ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రైవేటీకరణను నిలిపివేయాలి..
ప్రభుత్వం ప్రైవేటీకరణను నిలిపివేయాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. సామాజికంగా గుర్తింపులేని దళితులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించడమే సబ్ ప్లాన్ ముఖ్య ఉద్దేశం కాగా, ప్రభుత్వం ఈ నిధులను దళితుల ప్రత్యేక కార్యక్రమాలకు వినియోగించకుండా సాధారణ కార్యక్రమాలకు మళ్లిస్తోందన్నారు. అసైన్డ్ భూములు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో ఇచ్చినవేనని, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద అసైన్డ్ రైతులకు మేలు జరిగేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో SK సాబీర్ పాషా, దళిత హక్కుల పోరాట సమితి (డిహెచ్పీఎస్) రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కె. ఏసురత్నం, మరుపాక అనిల్ కుమార్, రైతు సంఘాల జిల్లా కార్యదర్శి, ముత్యాల విశ్వనాథం, డిహెచ్పీఎస్ జిల్లా కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్, జిల్లా నాయకులు కంచర్ల జమలయ్య, బండి నాగేశ్వరరావు, కె రత్నకుమారి, పేరాల శీను, చెన్నయ్య, మామిడాల ధనలక్ష్మి, జకరయ్య, సంఘమిత్ర తదితరులు పాల్గొన్నారు.
Kothagudem | జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి.. కొత్త అక్రెడిటేషన్ కార్డులపై మీడియా అకాడమీ విఫలం..
Kothagudem | మళ్లీ సర్వే చేయండి.. కులగణనలో మున్నూరుకాపులకు అన్యాయం: కాంపెల్లి కనకేష్ పటేల్
బస్సులున్నయ్.. డ్రైవర్లే లేరు !.. డిప్యూటీ సీఎం ఇలాకాలో ఆర్టీసీ డ్రైవర్ల కొరత!