– ఏదుల నుండి వాటర్ లెవల్ 440 చేయాలని చూస్తున్నరు
– అలా చేస్తే శివన్నగూడెం రిజర్వాయర్కి చుక్క నీరు రాదు
– డిండి ప్రాజెక్ట్‌పై ఈఎన్సీ ద్వంద్వ నీతి నల్లగొండ జిల్లాకు శాపం
– 436 లెవల్ నుండే నీటిని తీసుకురావాలి
నల్లగొండ, మార్చి 07 : డిండి ప్రాజెక్టుపై ఈఎన్సీ ద్వంద్వ నీతి నల్లగొండ జిల్లాకు శాపం అని, తక్షణమే 436 మీటర్ల లెవెల్ నుండే నీరు ఇవ్వాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. (వట్టెం) ఏదుల రిజర్వాయర్ నుండి నీటి తరలింపు విషయంలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ (ENC) అనుసరిస్తున్న ద్వంద్వ నీతి నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల ప్రజల పాలిట శాపంగా మారిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు 436 మీటర్ల ఎత్తు నుండే నీటిని తరలించేలా అవకాశం కల్పించి, డిండి కాల్వకు మాత్రం 440 మీటర్ల ఎత్తు నుండి మాత్రమే నీరు తీసుకునేలా నిబంధనలు మార్చడం ముమ్మాటికీ నల్లగొండ జిల్లాపై జరుగుతున్న కుట్ర అన్నారు.
ఈఎన్సీ అధికారులు వట్టెం వైపు 6 మోటార్లకు బదులు 8 మోటార్లు బిగించి రోజుకు 2 టీఎంసీల నీటిని తరలించే అవకాశం కల్పించారు. కానీ డిండికి మాత్రం 436.70 మీటర్లకు బదులు 440 మీటర్ల ఎత్తు నిబంధన తీసుకురావడం వల్ల రోజకు 6 వేల క్యూసెక్కులకు బదులు కేవలం 1,500 క్యూసెక్కుల నీరు మాత్రమే సరఫరా అవుతుందన్నారు. రిజర్వాయర్ లో నీటిమట్టం 440 మీటర్ల నుండి 436.70 కు తగ్గినప్పుడు ఈ 1,500 క్యూసెక్కుల నీరు కూడా కేవలం 56 రోజులు మాత్రమే డిండి కాలువకు సరఫరా జరిగే అవకాశం ఉందన్నారు. దీనివల్ల ప్రభుత్వం నిర్ణయించిన 30 టీఎంసీలకు బదులు కేవలం 7 టీఎంసీల నీరు మాత్రమే నల్లగొండ జిల్లాకు వచ్చే దుస్థితి ఏర్పడిందని తెలిపారు.
ఈఎన్సీ అధికారుల ఈ తప్పుడు నిర్ణయం వల్ల మునుగోడు, దేవరకొండ తదితర ప్రాంతాల ప్రజలకు సాగు, తాగునీరు అందే అవకాశం లేదని, అంతేకాకుండా వేల కోట్లు ఖర్చుపెట్టి శివన్నగూడెం వరకు నిర్మిస్తున్న ప్రాజెక్టులన్నీ వృథాగా మిగిలిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. నాగర్ కర్నూల్, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి జిల్లాలోని 21 మండలాల పరిధిలో 3.61 లక్షల ఎకరాల ఆయకట్టును ఎండబెట్టేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
1. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్షణమే స్పందించి ఈఎన్సీ తీసుకున్న ఈ ఏకపక్ష వివక్షాపూరిత నిర్ణయాన్ని వెంటనే సవరించాలి
2. వట్టం (పాలమూరు) ప్రాజెక్టుతో సమానంగా డిండి ప్రాజెక్టుకు కూడా 436 మీటర్ల లెవెల్ నుండే నీటిని విడుదల చేసేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి
3. డిండి ఎత్తిపోతల ద్వారా తరలించాల్సిన 30 టీఎంసీల నీటిని ఎలాంటి ఆటంకాలు లేకుండా నల్లగొండ జిల్లాకు అందించాలి.
నల్లగొండ జిల్లా ప్రజలకు, రైతులకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని ప్రభుత్వం వెంటనే సరిదిద్దకపోతే అధికారులు తమ ద్వంద్వ నీతిని మార్చుకుని, డిండి ప్రాజెక్టుకు సమన్యాయం చేయకపోతే జిల్లా ప్రజలను, రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని నెల్లికంటి సత్యం హెచ్చరించారు.