కొత్తగూడెం అర్బన్, ఫిబ్రవరి 24: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో తమకు అన్యాయం జరిగిందని మున్నూరు కాపు సంఘం జిల్లా నాయకులు కాంపెల్లి కనకేష్ పటేల్ అన్నారు. సర్వేను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లాలో జరిగిన గ్రీవెన్స్‌లో జిల్లా అదనపు కలెక్టర్ వేణుగోపాల్‌కు వినతి పత్రం అందించి సమస్యను వివరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. కులగణన సర్వేను తిరిగి నిర్వహించి మున్నూరు కాపుల జనాభా ఎంత ఉన్నదో లెక్కతేల్చాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
2014లో అప్పటి ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్రంలో మున్నూరు కాపుల జనాభా 28 లక్షల మందిగా తేలిందని వెల్లడించారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో 13 లక్షల మంది మాత్రమే మున్నూరు కాపులు ఉన్నట్లుగా చెబుతున్నదని మండిపడ్డారు. గత పదేండ్ల కాలంలో రాష్ట్రంలో మున్నూరు కాపు జనాభా పెరగకపోగా 15 లక్షల మంది తగ్గిందని మండిపడ్డారు. వారంతా ఏమయ్యారో సర్వే చేసిన ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి 2014లోనే 51 శాతంగా ఉన్న బీసీ జనాభాను ఇప్పుడు 46 శాతానికి తగ్గించి చూపారని విమర్శించారు. ఇదంతా చూస్తుంటే ఇప్పుడు జరిగినటువంటి సర్వే అంతా బోగస్‌గా ఉన్నదని, ప్రభుత్వం తక్షణమే తిరిగి పారదర్శకంగా కులగణనను చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చింతా నాగరాజు, తోట మల్లేశ్వరరావు, బద్ది కిషోర్, గంధం నాగేశ్వర్రావు, బాలినేని నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.