కట్టంగూర్, మార్చి 07 : కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామంలోని సంఘబంధం-2లో శ్రీనిధి నిధులు, ఐకేపీ కేంద్రాల కమీషన్ లావాదేవీలపై శనివారం డీఆర్ డీఏ అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. గ్రామంలోని సంఘ బంధం-2లో ఐకేపీ, శ్రీనిధి, సీఐఎఫ్ నిధుల వినియోగంపై అవినీతి జరిగిందని ఆరోపిస్తూ వీఓఏ నిధులు మళ్లించారంటూ సంఘబంధం అధ్యక్షులు గద్దపాటి రేణుక గత నెల ఫిబ్రవరిలో ప్రజావాణిలోని కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. కలెక్టర్ ఆదేశాల మేరకు డీపీఎం వీరయ్య, శ్రీనిధి ఆర్ఎం శ్రీలేఖ, ఏపీఎం రాములు, అడిటర్ సత్తిరెడ్డి, సీసీ ప్రసాద్ శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అవరణలో సమభావన సంఘాల అధ్యక్షులు, సభ్యులతో సమావేశం నిర్వహించి విచారణ చేపట్టారు. సభ్యుల నుండి వివరాలను అడిగి తెలుసుకునాన్నారు. ఈ సందర్భంగా కొంత గందరగోళం నెలకొంది.
ఈ సందర్భంగా విచారణ అధికారులు మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ ప్రారంభించామని తెలిపారు. 2016 నుంచి 11 సీజన్ల వరకు ఐకేపీ కేంద్రాలకు సంబంధించి కమీషన్ వివరాలను సీజన్ వారిగా రాయాలని ఆదేశించినట్లు తెలిపారు. సంఘాలకు సంబంధించిన బుక్కులు సీరియల్ ప్రకారం లేకపోవడం, శ్రీనిధి ఖాతాలకు సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో లేనందున తదుపరి విచారణ కోసం మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు. శ్రీనిధి నిధులు, ఐకేపీ కొనుగోళ్ల కమీషన్ వివరాలను పూర్తి స్థాయిలో సేకరించి ఉన్నతాధికారుల సమర్పిస్తామని తెలిపారు. ఇది ఇలా ఉండగా గతంలో పనిచేసిన సీసీ సత్యనారాయణ బదిలీపై మహిళలు అధికారులను ప్రశ్నించారు. ఇట్టి విషయాన్ని డీఆర్డీఏ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.