మధిర, ఫిబ్రవరి 23 : మధిర ఆర్టీసీ డిపోలో బస్సు డ్రైవర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. దీంతో మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినప్పటికీ మధిర నియోజకవర్గంలో మాత్రం మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ర్టానికి ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న మధిర నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క ఇలాకాలో ఇలాంటి పరిస్థితి ఉండటం చూసి ప్రజలు ముక్కన వేలేసుకుంటున్నారు. మధిర నియోజకవర్గ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్న భట్టి ఆర్టీసీ డ్రైవర్ల కొరత సమస్యను తీర్చలేకపోతున్నారని చర్చించుకుంటున్నారు.
నియోజకవర్గ కేంద్రం మధిర ఆర్టీసీ డిపోలో బస్సులు ఉన్నప్పటికీ డ్రైవర్ల కొరతతో సర్వీసులు తిప్పలేకపోతున్నారు. దీంతో ఉచిత బస్సు ప్రయాణం ఉన్నా ప్రయోజనం ఏమీలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక తక్కువ సర్వీసులు నడిపిస్తున్నందున బస్సులు కిక్కిరిసిపోయి ప్రయాణం చేయడం కష్టంగా మారుతోందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ సమస్య అధిగమించాలంటే మధిర డిపోకు డ్రైవర్ల కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క కొత్త బస్టాండ్ నిర్మాణం కోసం రూ.10 కోట్లను మంజూరు చేశారు.. అయినా ప్రయోజనం ఏముందని ప్రయాణికులు వాపోతున్నారు. నియోజకవర్గ ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడంలో వెనుకడుగు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవంగా మధిర ఆర్టీసీ బస్సు డిపో పరిధిలో కేవలం ఎర్రుపాలెం, మధిర, బోనకల్లు మండలాల్లో కొన్ని గ్రామాల్లో ప్రధానరోడ్డు మార్గం ద్వారా ప్రయాణికులకు బస్సు సౌకర్యాన్ని కల్పించారు. కానీ మారుమూల ప్రాంతాలకు మాత్రం సర్వీసులను నడిపించడానికి అవకాశం లేక మధిర ఆర్టీసీ అధికారులు చేతులెత్తేశారు. ఒకప్పుడు ఈ బస్సు డిపోలో 80 బస్సులు ఉండటంతో ప్రతి గ్రామానికి బస్సులను నడిపించారు. అప్పుడు డ్రైవర్లు, కండక్టర్లు పూర్తిస్థాయిలో ఉండటం వల్ల మారుమూల ప్రాంతానికి కూడా ఆర్టీసీ బస్సులు నడిపించారు. ప్రస్తుతం ఆర్టీసీ డిపోలో 46 బస్సులు మాత్రమే ఉన్నాయి. ఈ బస్సులకు పూర్తిస్థాయిలో డ్రైవర్లు లేకపోవడం వల్ల ప్రయాణికుల కోసం సర్వీసులు నడిపించే పరిస్థితి లేకుండాపోయింది. మధిర డిపో నుంచి ఎక్కువగా హైదరాబాద్, విజయవాడ, ఖమ్మం, వైరా ప్రాంతాలకు మాత్రమే పల్లెవెలుగు బస్సులను ఆర్టీసీ అధికారులు నడిపిస్తున్నారు.
మారుమూల ప్రాంతాలకు బస్సులు నడిపించలేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు సర్వీసులను ఆశ్రయిస్తున్నారు. డ్రైవర్ల కొరతతో పూర్తిస్థాయిలో ప్రజలకు బస్సు సర్వీసులను నడిపించలేకపోతున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మధిర డిపో పల్లెవెలుగు 45 బస్సులు ఉన్నప్పటికీ 20 నుంచి 30 బస్సుల వరకు నిరుపయోగంగా డిపోకే పరిమితమై ఉంటున్నాయి. బస్సు సర్వీసులు నడిపించడంలో ఆర్టీసీ విఫలమైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. డిపోలో బస్సులు ఉన్నా ప్రయోజనం లేదని వాపోతున్నారు. స్వయానా రాష్ట్ర డిప్యూటీ సీఎం ఇలాకాలో డ్రైవర్ల కొరత సమస్య వేధిస్తున్నా పట్టించుకునే వారేలేరని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మధిర డిపోలో డ్రైవర్ల కొరత వేధిస్తున్నది. డ్రైవర్లుగా పనిచేసిన వారు రిటైర్ కావడం, అనారోగ్య సమస్యలతో విధులకు హాజరుకాకపోవడంతో డ్రైవర్ల కొరత ఏర్పడింది. 2009 నుంచి ఇప్పటివరకు ఆర్టీసీ డ్రైవర్ల నియామకం జరగలేదు. ఉన్న డ్రైవర్లతోనే అత్యవసర సర్వీసులను నడిపిస్తున్నాం. డ్రైవర్ల కొరత విషయాన్ని ఆర్టీసీ సంస్థకు తెలియజేశాం. డ్రైవర్లను కేటాయిస్తే బస్సులన్నింటినీ ప్రజల సౌకర్యార్థం మారుమూల ప్రాంతాలకు సైతం నడిపిస్తాం.
– శంకర్రావు, మధిర డిపో మేనేజర్