– కెవిపిఎస్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున
రామగిరి, మార్చి 07 : గత పది సంవత్సరాలుగా దళితుల అభివృద్ధి పూర్తిగా శూన్యంగా మారిందని, ప్రభుత్వాలు మారినా దళితులకు సంబంధించిన సంక్షేమ పథకాలు అమలు కాలేదని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు. ఈ నెల 23న నల్లగొండ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం ముందు భారీ ఎత్తున దళితులతో ధర్నా నిర్వహిస్తున్నట్లు, ఈ ధర్నాను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. శనివారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నల్లగొండ జిల్లా కమిటీ సమావేశం స్థానిక దొడ్డి కొమరయ్య భవనంలో జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీను అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం దళితుల సంక్షేమానికి మెరుగైన కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఎలాంటి కేటాయింపులు చేయలేదని, యాక్షన్ ప్లాన్ కూడా విడుదల చేయలేకపోయిందని విమర్శించారు. జిల్లాలో పరిశ్రమల కేంద్రం ద్వారా దళితులు, గిరిజనులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు కూడా నాలుగు సంవత్సరాలుగా అందకపోవడం ఏమిటని ప్రశ్నించారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కాగితాలకే పరిమితమైపోయాయని, వాటిని ఖర్చు చేసి దళితుల సంక్షేమానికి ఉపయోగించిన దాఖలాలు కనిపించడం లేదన్నారు. దళితులకు భూమి, ఇండ్లు, ఇండ్ల స్థలాలు, మంచినీరు, మురికికాలువలు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు ఇప్పటికీ అందకపోవడం బాధాకరమన్నారు. కెవిపిఎస్ ఆధ్వర్యంలో వచ్చే నెల ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా కులరహిత సమాజ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే పూలే–అంబేద్కర్ జనజాతర కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో సర్వేలు నిర్వహించి ఉద్యమాలు, పోరాటాలు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు రెమిడాల పరిషరాములు, సహాయ కార్యదర్శులు గాదె నరసింహ, బొల్లు రవీందర్, పెరికే విజయ్ కుమార్, ఒంటెపాక కృష్ణ, కోడిరెక్క మల్లన్న, జిల్లా కమిటీ సభ్యులు దండు రవి, చిలుముల రామస్వామి, రాజశేఖర్, వెంకన్న పాల్గొన్నారు.