కొత్తగూడెం అర్బన్, ఫిబ్రవరి 24: రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితులు దారుణంగా వున్నాయని, జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల కనీస సమస్యలను పరిష్కరించకుండా ఏండ్ల తరబడి పెండింగ్‌లో పెడుతూ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Kothagudem) అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌కు యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు, రామిసెట్టి సైదయ్య, రాజేందర్, సుధాకర్ రావు , మధులిక తదితరకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇండ్ల స్థలాల విషయంలో సర్కారు ప్రత్యేక చొరవ చూపాలని, ఇండ్ల స్థలాలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సర్కారు రివ్యూ పిటిషన్ వేసి వాదనలు చేయాలన్నారు. జర్నలిస్టులకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనట్లయితే కొత్త విధానం ద్వారా ఇండ్లస్థలాలు ఇవ్వాలని, ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా హెల్త్ స్కీమ్‌ను అమలుచేయాలన్నారు. జర్నలిస్టుల కాంట్రిబ్యూషన్‌ను ప్రభుత్వమే భరించాలని, ప్రైవేటు, కార్పొరేట్ దవాఖానల్లో అమలయ్యేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కొత్త అక్రెడిటేషన్ కార్డులను అందజేయడంలో మీడియా అకాడమీ విఫలమైందని ఆరోపించారు. వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త కార్డులివ్వాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా రిటైరైన జర్నలిస్టులకు పెన్షన్ పథకాన్ని అమలు చేయాలన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులను అరికట్టాలని, ఇందుకోసం ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా ప్రత్యేక రక్షణ చట్టాన్ని తేవాలన్నారు. అర్హత ఉన్న చిన్న, మధ్య తరహా పత్రికలు ఎంప్యానల్మెంట్లో చేర్చాలన్నారు. తదితరులు పాల్గొన్నారు.