సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్‌లో రోగులకు నాణ్యత లేని డైట్(భోజనం) అందిస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. అనారోగ్యంతో చికిత్స పొందే రోగులకు నాణ్యమైన డైట్ అందించినప్పుడే వారు త్వరగా కోలుకుంటారు. రోగులకు చికిత్స ఎంత ముఖ్యమో వారికి ఇచ్చే డైట్కూడా అంతే ముఖ్యమని, నాణ్యమైన, పౌష్టిక ఆహారం తీసుకున్నప్పుడే రోగనిరోధక శక్తి పెరిగి రోగులు త్వరగా కోలుకుంటారని వైద్యులు చెబుతున్నారు. కానీ నగరంలోని ప్రభుత్వ దవాఖానల్లో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందంటున్నారు రోగులు. ముఖ్యంగా గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఎంఎన్‌జే క్యాన్సర్ హాస్పిటల్, సుల్తాన్‌బజార్, పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖానల్లో రోగులకు అందించే డైట్ పూర్తి నాసిరకంగా ఉంటుందని రోగులు ఆరోపిస్తున్నారు.
ఉడికీ ఉడకని అన్నం..
రోగులకు ఇచ్చే పాలు పూర్తిగా నీళ్లలా ఉంటున్నాయని, ఇచ్చే నీళ్ల పాలు కూడా ఒక కప్పు మోతాదులోనే ఇస్తారని రోగులు వాపోతున్నారు. ఇక పప్పుచారు నీళ్ల చారులా ఉంటుందని, ఉన్న కూరల్లో సరైన ఉప్పుకారం లేకుండా సప్పగా వడ్డిస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు. వడ్డించే అన్నం చాలా సార్లు ఉడికీ ఉడకన్నట్లుగా ఉంటుందని ఆరోపిస్తున్నారు.
వడ్డించేది కొందరికే..
ఆయా దవాఖానల్లో చేరి, చికిత్స పొందుతున్న రోగులకు అందించే డైట్లోనూ కొందరు అధికారుల సహకారంతో డైట్ కాంట్రాక్టర్లు అవినీతికి పాల్పడుతున్నారు. రోగులకు నాణ్యమైన డైట్‌ను అందించకపోవడమే కాకుండా 10మందికి వడ్డించి, వందమందికి వడ్డించినట్లు రికార్డుల్లో చూపిస్తున్నట్లు సమాచారం. దీనికి ఆయా దవాఖానల్లోని సంబంధిత అధికారులు సైతం సహకరిస్తుండడంతో రోగుల పేరుమీద లక్షల రూపాయలను స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పర్యవేక్షణాలోపం
ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపం, కొందరు అధికారుల ఒప్పందంతో నగరంలోని ప్రభుత్వ టీచింగ్ హాస్పిటల్స్‌లో అక్రమార్కులకు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. డైట్, శానిటేషన్, పేషెంట్ కేర్ తదితర వాటిల్లో అటు కాంట్రాక్ట్ ఏజెన్సీలు, ఇటు సంబంధిత అధికారులు అందినంత దండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా వేసిన బిల్లలకు ముందస్తు ఒప్పందం ప్రకారం సంబంధిత అధికారులు సంతకాలు పెడుతూ తమ వాటాలను పుచ్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని వల్ల అటు రోగులకు సరైన వైద్యసేవలు అందకపోగా ఇటు ప్రజా ధనం కూడా అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తున్నది.
ఆరోగ్యశ్రీ రోగులకూ అదే డైట్
సాధారణ రోగులకు, ఆరోగ్యశ్రీ కొంద చేరిన రోగులకు ఇచ్చే డైట్ వేర్వేరుగా ఉంటుంది. ఆరోగ్యశ్రీ కింద చేరిన రోగులకు ఇచ్చే డైట్ సాధారణ రోగుల కంటే మరింత నాణ్యతతో పాటు అధిక మోతాదులో ఉంటుంది. కానీ ప్రస్తుతం అన్ని ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ పేషెంట్లకు ఇచ్చే డైట్‌నే ఆరోగ్యశ్రీ రోగులకూ ఇస్తున్నట్లు రోగులు ఆరోపిస్తున్నారు.