BRS Party Leaders | సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 23 : సిరిసిల్ల పట్టణంలో ఫ్లెక్సీల వివాదం నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేశారు. వేదికతోపాటు బతుకమ్మ ఘాట్ పరిసరాలలో కేటీఆర్ ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సోమవారం సాయంత్రం వేడుకల నిర్వహణ జరగాల్సి ఉండగా.. భారీ వర్షం కురవడంతో తెలంగాణ భవన్‌లోనే వేడుకలు నిర్వహించారు. మంగళవారం ఉదయం ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే మున్సిపల్ సిబ్బంది బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.
బతుకమ్మ ఘాట్ వద్దకు బీఆర్ఎస్ నాయకులు భారీ సంఖ్యలో చేరుకొని ఆందోళనకు దిగారు. సమాచారం తెలుసుకున్న సీఐ కృష్ణ అక్కడికి చేరుకొని మున్సిపల్ అధికారులను పిలిపించి మాట్లాడారు. ఫిర్యాదు చేస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పడంతో నాయకులు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి విలేకరులతో మాట్లాడుతూ.. బతుకమ్మ వేడుకల కోసం రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు స్థానిక బతుకమ్మ ఘాట్ వద్ద భారీ ఏర్పాట్లు చేశామన్నారు.
వర్షం కారణంగా వేడుకలను తెలంగాణ భవన్లో నిర్వహించామని చెప్పారు. బతుకమ్మ వేడుకల కోసం ఘాటు వద్ద ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను తాము స్వయంగా తొలగించుకుంటామని చెప్పినప్పటికీ.. ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే మున్సిపల్ అధికారులు ఇష్టానుసారంగా తొలగించాలని ఆరోపించారు. తమ పార్టీ ఫ్లెక్సీలను తొలగించిన మున్సిపల్ అధికారులకు అక్కడే ఉన్న అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. అధికారులు పక్షపాత వైఖరి చూపిస్తే సహించేది లేదని అసహనం వ్యక్తం చేశారు.
ఒక రోజు సమయం ఇవ్వకుండానే..
వేడుకల కోసం ఏర్పాటుచేసిన వేదిక టెంట్ క్లాత్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఇష్టానుసారంగా కోసి వేసినట్లు ఆరోపించారు. అధికార పార్టీ నేతల ఫ్లెక్సీలు రోజులపాటు ఉంటున్నా పట్టించుకోని మున్సిపల్ అధికారులు బీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఒక రోజు సమయం ఇవ్వకుండానే తొలగించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతమైతే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
బీఆర్ఎస్ నాయకుడు బుల్లి రామ్మోహన్ మాట్లాడుతూ.. సిరిసిల్లలో కేటీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న దురుద్దేశంతోనే కొంతమంది నాయకుల కనుసన్నల్లో ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమం జరిగిందని ఆరోపించారు. గులాబీ కండువా ప్రజల గుండెల్లో ఉంటుందని కేటీఆర్‌ను సిరిసిల్ల ప్రజలు ఎప్పుడు తమ ప్రాణంగా చూసుకుంటారని గుర్తుంచుకోవాలన్నారు. ఇటువంటి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే తాము ఎంతటికైనా సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గూడూరి ప్రవీణ్, మంచే శ్రీనివాస్, మ్యాన రవి, సత్తార్, న్యాలకొండ రాఘవరెడ్డి, దార్ల సందీప్, అన్నారం శ్రీనివాస్, కుంభాల మల్లారెడ్డి, బుర్ర రాజు గౌడ్, సామల శ్రీనివాస్, అడగట్ల సాయికృష్ణ, రికుమల్ల సంపత్, తదితర నాయకులు ఉన్నారు.
Hyderabad Metro | మరోసారి ఆగిపోయిన మెట్రో రైలు.. ఆందోళనకు గురైన ప్రయాణికులు
Fire Accident | మైలార్‌దేవ్‌పల్లి పీఎస్ పరిధిలో తప్పిన పెను ప్రమాదం
Harish Reddy | నెలరోజులైనా తెరచుకోని రామగుండం ఎరువుల కర్మాగారం: బీఆర్ఎస్ నేత హరీశ్ రెడ్డి