Maha Shivaratri | వేములవాడ రూరల్, ఫిబ్రవరి 15 : మహాశివరాత్రికి ఆర్టీసీ బస్సుల్లో వేములవాడ (Vemulawada)కు వచ్చే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్టీసీ కరీంనగర్ రీజినల్ మేనేజర్ రాజు పేర్కొన్నారు. ఇవాళ వేములవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25, 26, 27 తేదీల్లో జరిగే మహాశివరాత్రి జాతరకు 780 ప్రత్యేక బస్సులు (Special Buses) నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు.
బస్సులు లేవనే సమస్య తలెత్తకుండా ప్రతీ ప్రాంతం నుండి ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక చార్జీలు వసూలు లేకుండానే హైదరాబాద్ వరంగల్ కరీంనగర్, కామారెడ్డి కోరుట్ల మెట్టుపల్లి జగిత్యాలతోపాటు పలు ప్రాంతాల నుండి ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నామన్నారు.
గత శివరాత్రికి 680 బస్సులు నడపగా.. ఈ సంవత్సరం 100 బస్సులను అదనంగా నడిపిస్తున్నామన్నారు. దాదాపు లక్షకుపైగా ప్రయాణికులు ఆర్టీసీలో ప్రయాణించే అవకాశం ఉన్నందున 780 బస్సులు నడిపిస్తున్నామన్నారు. తిప్పాపూర్ బస్టాండ్ జగిత్యాల బస్టాండ్ నుండి ప్రత్యేకంగా ఈ బస్సులు నడుస్తాయన్నారు. తిప్పాపూర్ బస్టాండ్ నుండి రాజన్న ఆలయానికి ఫిబ్రవరి 25, 26, 26 తేదీల్లో 14 బస్సులు ఉచితంగా ఏర్పాటు చేశామన్నారు.
బస్సులు లేవని మాట రాకుండా ఈ మహాశివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని, ఆర్టీసీ బస్సులో ప్రయాణించే వారికి సురక్షితంగా గమ్యానికి చేర్చుతామన్నారు. నిరంతము ఆర్టీసీ అధికారులు ప్రయాణికులకు సూచనలు సలహాలు అందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. మహాశివరాత్రికి వేములవాడకు వచ్చే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ఎంలు భూపతిరెడ్డి సత్యనారాయణ డిఎం లు శ్రీనివాస్‌తోపాటు ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు.
Government Hospital | రికార్డ్ బ్రేక్.. 5 రోజుల్లో 200 సర్జరీలు