Akhilesh Yadav : తమ పార్టీ ఎప్పుడూ యుద్ధాలకు అనుకూలం కాదని సమాజ్వాది పార్టీ చీఫ్ (SP chief) అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతున్నాయని, ఆ యుద్ధాలు ఆగకుండా కొనసాగుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇవాళ ఉదయం ఎట్టావా (Etawah) లో తన అభిమానులతో కలిసి హోలీ సంబురాలు (Holi celebrations) జరుపుకున్న అఖిలేష్.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం ఒకటి మరో దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిందని, ఎవరికి కూడా ఇలాంటిది జరగకూడదని అఖిలేష్ యాదవ్ అన్నారు. వెనెజువెలా అధ్యక్షుడు మధురోను అమెరికా సైన్యం ఎత్తుకెళ్లడాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్య చేశారు. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం భారత ప్రజలపై కూడా ప్రభావం చూపుతుందని అన్నారు. సమాజ్వాది పార్టీ ఎన్నడూ యుద్ధాలకు అనుకూలం కాదని చెప్పారు.