Ration Shop | ఆళ్లపల్లి, ఆగస్టు 14: రేషన్ బియ్యం కోసం వెళ్లిన ప్రజలకు చీకటి కష్టాలు తప్పలేదు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామంలోని జీసీసీ కేంద్రంలో గురువారం రాత్రి చీకట్లోనే రేషన్ బియ్యం పంపిణీ చేశారు. కనీసం ప్రత్యామ్నాయంగా లైట్లు ఏర్పాటు చేయకపోవడంతో లబ్ధిదారులు చీకట్లోనే బియ్యం తీసుకోవాల్సి వచ్చింది.
రేషన్ కోసం వచ్చిన ప్రజలు చీకట్లో బారులు తీరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షాకాలం కావడంతో పాములు, విషపురుగులు సంచరించే ప్రమాదం ఉందని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. విద్యుత్ సరఫరా లేదన్న విషయం ముందే తెలిసినా రేషన్ పంపిణీ కేంద్రం వద్ద ప్రత్యామ్నాయ లైటింగ్ ఏర్పాటు చేయకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు నిత్యం వినియోగించే కేంద్రంలో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఎవరిదని నిలదీస్తున్నారు.
గ్రామంలోని రేషన్ పంపిణీ కేంద్రంలో కనీస వెలుతురు సౌకర్యం లేకపోవడంపై సర్పంచ్, ఉపసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్ లేకున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. చీకట్లో రేషన్ కోసం నిలబడాల్సిన పరిస్థితి ఎందుకు రావాలి? అని ప్రశ్నిస్తున్నారు. రేషన్ బియ్యం తీసుకునేందుకు వచ్చిన ప్రజల భద్రతను పట్టించుకోకుండా పంపిణీ చేయడం సరికాదని అంటున్నారు.
ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి జీసీసీ కేంద్రానికి శాశ్వత విద్యుత్ సరఫరా కల్పించడంతో పాటు, విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు ఉపయోగించేందుకు ప్రత్యామ్నాయ లైటింగ్ ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రజలకు ఇబ్బందులు, ప్రమాదాలు ఎదురయ్యే వరకు వేచి చూడకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.