న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: యూపీఐ లావాదేవీలపై కేంద్రం వచ్చే నెల నుంచి విధించనున్న 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్)కు నిరసనగా అక్టోబర్ 2న దేశ వ్యాప్తంగా ‘నో యూపీఐ డే’ను నిర్వహించడానికి మొబైల్ ఫోన్ రిటైలర్లు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. గాంధీ జయంతి రోజున దేశ వ్యాప్తంగా ఉన్న మొబైల్ రిటైలర్లు తమ యూపీఐ క్యూఆర్ కోడ్లను నల్ల బట్టతో కప్పి, యూపీఐ చెల్లింపులను తిరస్కరిస్తూ నిరసన వ్యక్తం చేయాలని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (ఏఐఎంఆర్ఏ) పిలుపునిచ్చింది.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మొబైల్ ఫోన్ రిటైలర్లపై అదనపు భారం పడుతుందని అసోసియేషన్ ఉపాధ్యక్షుడు తర్వీందర్ సింగ్ తెలిపారు. దీని కారణంగా ప్రతి వ్యాపారికి నెలకు రూ.2 వేల నుంచి 12 వేల వరకు నష్టం వస్తుందని చెప్పారు. ఇక దేశ వ్యాప్తంగా చూస్తే ఈ భారం మొబైల్ వ్యాపారులపై నెలకు రూ.40 కోట్లు, ఏడాదికి రూ.500 కోట్ల వరకు ఉంటుందన్నారు. యూపీఐ, డిజిటల్ చెల్లింపులకు తాము వ్యతిరేకం కాదని, దానిపై విధించిన చార్జీలను వ్యాపారులపై మోపడాన్నే తాము నిరసిస్తున్నామని ఆయన తెలిపారు.