Putta Shailaja | మంథని, సెప్టెంబర్ 16 : ప్రజల క్షేమం కోసం ఆలోచిస్తున్న తమపై మంథని ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులతో దాడి చేయిస్తున్నాడని.. మంథని నియోజకవర్గ ప్రజల కోసమే మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్, తాను చావడానికైనా.. బతుకడానికైనా సిద్ధమేనంటూ మంథని మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పుట్ట శైలజ అన్నారు. మంథని డివిజన్లోని కమాన్‌పూర్ మండలం పెంచికల్‌పేట గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మాట్లాడిన తీరును ఖండిస్తున్నామంటూ మంథనిలోని రాజగృహ ముందు కాంగ్రెస్ నాయకులు మంగళవారం ధర్నాకు దిగారు.
కాంగ్రెస్ నాయకులు పుట్ట మధూకర్ నివాసం ముందు కూర్చొని పుట్ట మధూకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న క్రమంలో పుట్ట శైలజ, బీఆర్ఎస్ నాయకులు అక్కడికి చేరుకొని దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఎలాంటి అనుమతులు లేకుండా తమ ఇంటి ముందు ధర్నా చేయడమేంటని ప్రశ్నించారు. పోలీసుల అండతో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేయడమేంటని అనడంతో కాంగ్రెస్ నాయకులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. అక్కడే ఉన్న పోలీసులతో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తూ దాడికి యత్నిస్తున్నప్పటికీ ఎందుకు పట్టించుకోవడం లేదంటూ పుట్ట శైలజ పోలీసులను నిలదీశారు.
రెండు గంటల పాటు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తూ, దాడికి యత్నిస్తూ ఎందుకు చోద్యం చూస్తున్నారని.. కాంగ్రెస్ నాయకులు ప్రాణాలు తీసినా కూడ పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పుట్ట శైలజ విలేకరులతో మాట్లాడుతూ.. కమాన్‌పూర్ మండలం పెంచికల్‌పేటలో బీఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడమే పుట్ట మధూకర్ చేసిన తప్పా అని అన్నారు. మంథనిలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే తన తండ్రి శ్రీపాదరావు విగ్రహాలు మాత్రమే పెట్టుకుంటామని, ప్రతీ ఇంటిలో తన తండ్రి విగ్రహాలు మాత్రమే ఉండాలి.. అనే ఆలోచనతోనే మా ఇంటి కాంగ్రెస్ నాయకులను పురమాయించి దాడి చేయించాడన్నారు.
ప్రజలకు సేవ చేసేందుకు నిరంతరం కృషి..
అధికారంలోకి వచ్చిన రెండేళ్లు గడవక ముందే ఇంతలా దాడికి పాల్పడితే మరో రెండేళ్లు ఎలా గట్టెక్కుతుందని మనం చూడాల్సిన పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయన్నారు. ఏసీపీ, సీఐలు దగ్గరుండి మరీ మా ఇంటిపై దాడి చేయించారన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి 24 గంటలు కూడా గడువకముందే ఇలాంటి ఘటనకు కాంగ్రెస్ నాయకులు తెరలేపడం అరాచకమన్నారు. దాడులతోనే, కేసులతో పుట్ట మధూకర్, పుట్ట శైలజలను కాంగ్రెస్ నాయకులు ఆపలేరు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
మేమిద్దరం మంథని నియోజకవర్గ ప్రజల కోసమే బతుకుతున్నామని.. ప్రజలకు సేవ చేసేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. రైతులు ఒక వైపు యూరియా కోసం అల్లాడుతుంటే వారి కష్టాలు తీర్చాల్సిన అధికార పార్టీ నాయకులు వాటిని పక్కన పెట్టి కేవలం తమ నాయకుడి మెప్పు కోసం ఇలా దాడులకు దిగడం వారి విజ్ఞతకే వదిలి పెడుతున్నామన్నారు. పుట్ట మధూకర్ ఎమ్మెల్యేగా, జడ్పీ చైర్మన్‌గా ఉన్న సమయంలో మంథనిలో అనేక మంది మహానీయుల విగ్రహాలను ఆవిష్కరించారని గుర్తు చేశారు.
పేరు పెద్దగా చెప్పుకునే కాంగ్రెస్ ఎమ్మెల్యే మహానీయుల విగ్రహాలను ఆవిష్కరించడం పక్కన పెడితే కనీసం ఉన్న విగ్రహాలను ఏనాడైనా ముట్టుకున్నాడా..? అని ప్రశ్నించారు. దాడులకు దిగడం కాదు దమ్ముంటే మేము పెట్టిన పీవీ, చాకలి ఐలమ్మ, జగ్జీవన్ రాం, గుండా నాగరాజు విగ్రహాలకు పూల దండలు ఎమ్మెల్యేతో వేయించాలని హితవు పలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన 420 హామీల అమలుకు కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలే తప్పా మహానీయుల విగ్రహాలను ఆవిష్కరిస్తే దాడులు దిగడం సరైంది కాదన్నారు. నియోజకవర్గ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే ప్రజలే వారికి తగిన గుణపాఠం చెప్తారన్నారు.
Miyapur | మియాపూర్ డిపోలో విషాదం.. గుండెపోటుతో కండక్టర్ మృతి
KTR | రాజ్యాంగంపై, సుప్రీంకోర్టుపై బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదు : కేటీఆర్
Powerhouse OST | రజినీకాంత్ ‘కూలీ’ నుంచి ‘పవర్‌హౌస్’ ఓఎస్టీ విడుదల