Miyapur | హైదరాబాద్ : మియాపూర్ డిపోలో విషాదం నెలకొంది. ఓ కండక్టర్ గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. కండక్టర్ మృతి పట్ల తోటి ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. పండరి అనే వ్యక్తి మియాపూర్ డిపోలో కండక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇవాళ ఉదయం డ్యూటీకి వచ్చిన పండరి.. వాష్‌రూమ్‌కు వెళ్లాడు. అక్కడే కుప్పకూలిపోయాడు. పండరిని గమనించిన తోటి ఉద్యోగులు.. ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుతో కండక్టర్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో డిపోలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పొద్దున్నే డ్యూటీకి వచ్చిన పండరి.. తమతో మాట్లాడి వాష్‌రూమ్‌కు వెళ్ళొస్తా అని చెప్పిన కొద్ది నిమిషాలకే విగతజీవిగా మారడంతో తోటి ఉద్యోగులు షాక్ అయ్యారు. యువకుడైన పండరి కళ్ళముందే మృత్యువాత పడటం చూసి సీనియర్ ఉద్యోగులు కన్నీరు పెట్టుకున్నారు.