కాంగ్రెస్ పాలనలో ప్రతి ఏడాదీ పరిహాస నామ సంవత్సరమే ఉగాదులు వస్తూ,పోతున్నయ్! ఊరించిన గ్యారెంటీల్లేవ్ మ్యానిఫెస్టో హామీల్లో పూర్తిచేసినవెన్ని? పూడ్చివేసినవెన్ని? సగం కాలం అయిపోయింది.. కాంగ్రెస్ ఫస్టాఫ్ డిజాస్టర్! సినిమా పేరు అభయహస్తం! కథ చూస్తే భస్మాసుర హస్తం! ఎన్నికల ముందు దానవీర శూర కర్ణ! ఆ తర్వాత కుంభకర్ణ! బఫర్ జోన్లపై ఉన్న శ్రద్ధ.. ఎరువుల బఫర్ స్టాక్ మీద లేదు! 420 వరల్డ్ కప్ పెడితే.. తెలంగాణ కాంగ్రెస్సే గెలుస్తది! కాంగ్రెస్ 420 హామీలు ఎన్నికల చరిత్రలోనే అతిపెద్ద ధోకా ఒకవైపు గృహమేధ యాగం.. మరోవైపు గ్రాఫిక్స్ బండారం మర్యాద, సంస్కారాలకు కాంగ్రెస్ దహన సంస్కారాలు ప్రజాపాలన ఎంజాయ్ చేస్తున్నది ఇద్దరే! దొంగలు, దోమలు! ఫాగింగ్ చేసే దిక్కులేనప్పుడు.. వీధులకు దోమలహిల్స్, దోమలాబాద్, దోమలాపూర్, దోమలగుట్ట పేర్లు పెట్టండి
బాకీలు.. బకాయిలు! డైవర్షన్లు.. కమిషన్లు! బుల్డోజర్ చప్పుళ్లు.. బూతుల మోతలు! ఆల్‌టైమ్ రికార్డు అప్పులు.. క్యూలో చెప్పులు! నోటిఫికేషన్లు నిల్.. లూటిఫికేషన్లు ఫుల్! చెక్‌డ్యాముల పేల్చివేత.. అడుగడుగునా అణచివేత! క్రెడిట్ చౌర్యం.. భూముల బేరం! స్కాముల గలగల.. స్కీముల వెలవెల! రైతులకు బేడీలు.. నిరుద్యోగులపై లాఠీలు! ఫిరాయింపుల కంపు.. బస్సు చార్జీల వాయింపు! ఫుడ్‌పాయిజన్ చావులు.. ఫుట్‌బాల్ సరదాలు! గల్లీల్లో చెత్తకుప్పలు.. ఢిల్లీకి విమాన యాత్రలు! మాటలు దడేల్.. చేతలు తుపేల్! దరఖాస్తులు, దండాలు, దఫ్తర్లు! 28 నెలల కాంగ్రెస్ పాలనంతా ఇంతే!
నెలలు గడిచినయ్.. సంవత్సరాలు మారినయ్.. శోభకృత్ నామ సంవత్సరం పోయింది. క్రోధి నామ సంవత్సరం వచ్చిందీ, పోయింది. విశ్వావసు నామ సంవత్సరం కూడా 19న అయిపోతుంది. పరాభవ నామ సంవత్సరం అడుగుపెడుతున్నది. కానీ, ఈ రెండున్నరేండ్ల పాలనలో ప్రజలకు మిగిలింది పరిహాసమే. ప్రతి సంవత్సరం పరిహాస నామ సంవత్సరమే. ఉగాదులు వస్తున్నయ్ పోతున్నయ్.. కానీ ఊరించి, ఊరించి ఓట్లు వేయించుకున్న గ్యారెంటీలు మాత్రం ప్రజల ఇంటికి రావడం లేదు.
-కేటీఆర్
హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 28 నెలల కాంగ్రెస్ పాలనలో ఎగ్గొట్టుడు, కూలగొట్టుడు, చెడగొట్టుడు తప్ప సాధించిందేమున్నదంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు. ‘ఆరు గ్యారెంటీలు, 420 హామీలను ఎగ్గొట్టుడు.. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లు కూలగొట్టుడు.. కేసీఆర్ పెట్టిన మంచి పథకాలను చెడగొట్టుడు.. ఇదే కాంగ్రెస్ పాలన’ అని మూడుముకల్లో అభివర్ణించారు. మొదటి క్యాబినెట్లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ సీఎం రేవంత్ సంతకం చేశారని చెప్పారని, మరి ఆ ఫైల్ ఏమైంది? అని ప్రశ్నించారు. ప్రజల సాక్షిగా బహిరంగ వేదికపై ముఖ్యమంత్రి సంతకం చేసిన ఆ ఫైల్ మాయమైతే ఎలా అని, దీనిపై ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశా రు. సీఎం సంతకానికే దికులేకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎలా నమ్ముతారని, ఇది జీరో వాల్యూ సర్కార్ అని ఎద్దేవా చేశారు. ఊరికే గాలివాటానికి ఇక్కడికి రాలేదని, తెలంగాణ ఉద్యమ ఉగ్గుపాలు తాగి వచ్చామని కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం కలిగితే అసెంబ్లీలోనైనా, వీధుల్లోనైనా పోరాడుతామని హెచ్చరించారు. మంగళవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై కేటీఆర్ మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, గణాంకాలతో అధికారపక్షాన్ని ఉకిరిబికిరి చేశారు. కేటీఆర్ మాట్లాడుతుండగా మంత్రులు కోమటిరెడ్డి, సీతక్క, భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అడుగడునా అడ్డుతగిలినా ఎక్కడా పక్కదారిపట్టకుండా పాయింట్ టూ పాయింట్‌గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడారు.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కేటీఆర్ బమ్మెర పోతన పద్యాన్ని ఉటంకిస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘కారే రాజులు రాజ్యముల్ గలుగవే.. గర్వోన్నతిం పొందరే.. వారేరీ సిరిమూట గట్టుకొని పోవంజాలిరే.. భూమిపై పేరైనం గలదే.. శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశఃకాములై ఈరే కోర్కెలు.. వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ’ అనే పద్యాన్ని చెప్పి దాని తాత్పర్యం వివరించారు. ‘ఆడిన మాట తప్పొచ్చు. అబద్ధాలు ఆడొచ్చు. ఏం తప్పులేదు రాజా’ అని బలిచక్రవర్తికి శుక్రాచార్యులు సలహా ఇచ్చారని వివరించారు. ‘చరిత్ర నిండా చాలామంది రాజులు తమ దర్పంతో గర్వాతిశయాన్ని ప్రారంభించినవారున్నారు. నేనే రాజు నేనే మంత్రి అని మిడిసిపడిన వాళ్లు ఎవ్వరూ సంపదలు మూటగట్టుకు పోలేరు. పదవులను వెంటబెట్టుకొని పోలేరు. భూమిపై మిగిలేది పేరు మాత్రమే’ అని బలి చక్రవర్తి చెప్పిన మాటలను ఉటంకించారు. అయితే, తాను శిబి చక్రవర్తి గురించి మాట్లాడుతుంటే గుమ్మడికాయల దొంగలా కాంగ్రెస్ నేతలు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవాచేశారు.
‘పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికైనా, శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి విలువ, విశ్వసనీయత ఉండాలని కేటీఆర్ సూచించారు. 2023 డిసెంబర్ 15న నాటి గవర్నర్ తమిళిసై చేసిన ప్రసంగంలో ‘ప్రజా సంక్షేమం కోసం ఆరు గ్యారెంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి.. హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై సీఎం రేవంత్‌రెడ్డి తొలి సంతకం చేయడం ఈ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం’ అని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ‘ఆ సంకల్పం ఏమైంది? ఎక్కడపోయింది ఆ చిత్తశుద్ధి?’ అని ప్రశ్నించారు.
‘28 నెలలుగా గడిచినా సీఎం సంతకం చేసిన ఆ ఫైలు ఎక్కడపోయింది? కాకి ఎత్తుకుపోయిందా? ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదంలో కాలిపోయిందా?’ అని కేటీఆర్ నిలదీశారు. తొలి క్యాబినెట్లో ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించినట్టు గుర్తు చేశారు. ఇప్పటికి 50 దాకా సమావేశాలు జరిగాయని ముఖ్యమంత్రి తొలిసంతకం చేసిన ఆ ఫైలు ఎలా మాయమైంది? బహిరంగంగా, వేదికపై సంతకం చేసిన ఆ ఫైలు ఎక్కడికి పోయింది? అని ప్రశ్నించారు. ఆ మాయమైన ఫైలు ఆచూకీ కోసం స్పెషల్‌గా ఒక సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
‘కొందరి ఆస్తుల విలువను జీరో వాల్యూ చేసినట్టు ముఖ్యమంత్రి చెప్తున్నడు.. సీఎం చేసిన తొలి సంతకానికి జీరో వాల్యూ, ఆ ఫైల్‌కు జీరో వాల్యూ, మీరు ఇచ్చిన గ్యారెంటీ కార్డులకు, మీ డిక్లరేషన్లకు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ.. మూసీలో మీరు కూల్చుతున్న ఇండ్లకు కాదు.. విశ్వసనీయతపై మీ ప్రభుత్వానికి ఈరోజు ప్రజల దృష్టిలో జీరో వాల్యూ ఉన్నది’ అని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రచురించిన ఫుల్‌పేజీ యాడ్స్‌లోని ఆరు గ్యారెంటీ కార్డులను అసెంబ్లీలో ప్రదర్శించారు. ‘ప్రతి కుటుంబానికీ 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు నెరవేర్చుతామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ గ్యారెంటీలతో అందే ప్రయోజనల విలువ రూ.రెండు లక్షల 50 వేలు. ప్రతి సంవత్సరం, ప్రతి కుటుంబానికీ రెండున్నరేండ్లు అయింది. రూ.రెండున్నర లక్షలు అందుకున్న ఒక్క కుటుంబాన్ని చూపిస్తారా?’ అని ప్రశ్నించారు. కనీసం రెండు లక్షలైనా వచ్చాయా? ’ అని నిలదీశారు.
28 నెలల పాలనలో కాంగ్రెస్ చెప్పుకోవడానికి బాకీలు.. బకాయిలు, డైవర్షన్లు.. కమీషన్లు, బుల్డోజర్ల చప్పుళ్లు.. బూతుల మోతలు, ఆల్‌టైమ్ రికార్డు అప్పులు.. క్యూలో చెప్పులు, 420 హామీల ఎగనామాలు.. మూడున్నర కోట్ల మందికి పంగనామాలు, నోటిఫికేషన్లు నిల్లు.. లూటిఫికేషన్లు ఫుల్లు, చెక్‌డ్యామ్‌ల పేల్చివేత.. అడుగడుగునా అణచివేత, క్రెడిట్ చౌర్యం.. భూముల బేరం, స్కాముల కళకళ.. స్కీముల వెలవెల, రైతన్నలకు బేడీలు.. నిరుద్యోగులపై లాఠీలు, ఫిరాయింపుల కంపు.. బస్సు చార్జీల వాయింపు, ఫుడ్ పాయిజన్ చావులు.. ఫుడ్‌బాల్ సరదాలు, గల్లీల్లో చెత్తకుప్పలు.. ఢిల్లీకి విమాన యాత్రలు, మాటలు దడేల్.. చేతలు తుపేల్, దరఖాస్తుల దండాలు.. దఫ్తర్లు!
-కేటీఆర్
‘కాంగ్రెస్ పాలనలో రెండున్నరేండ్లుగా జరిగిన పొరపాట్లు, సమస్యలను గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావిస్తారని భావించినం..పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా బీఆర్ఎస్ ఇవ్వలేదని కాంగ్రెస్ నేతలు అంటున్నరు. ఆరున్నర లక్షల రేషన్ కార్డులను గత ప్రభుత్వం ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే సభలో చెప్పిండ్రు. అంటే మీరు మీ మంత్రితోనే విభేదిస్తున్నారా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
‘ ఒక్కో కుటుంబానికి రూ.2,50,000 వేస్తామన్నరు. కోటీ 10 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నయి. ఒక్కో కుటుంబానికి రూ.2,50,000 లెక్కకట్టి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఫైనాన్స్ మినిస్టర్ కూడా. అవన్నీ ఇవ్వాలంటే ఏడాదికి రూ.2,75,000 కోట్లు ఇచ్చి ఉండాలి. అంత ఇచ్చారా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు.
‘కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో ప్రజలకు మిగిలింది పరిహాసమే. ప్రతి సంవత్సరం పరిహాస నామ సంవత్సరమే. ఉగాదులు వస్తున్నయ్ పోతున్నయ్.. కానీ ఊరించి, ఊరించి ఓట్లు వేయించుకున్నా గ్యారెంటీలు ఇంటికి రావడం లేదు’ అని కేటీఆర్ తూర్పారబట్టారు. ఈ ఏడాది గవర్నర్ ప్రసంగంలో పొరపాటున కూడా ‘గ్యారెంటీ’, ‘డిక్లరేషన్’ అనే పదాలు లేకుండా జాగ్రత్త పడ్డారని దుయ్యబట్టారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్టాఫ్ డిజాస్టర్.. సినిమా పేరు అభయ హస్తం.. దాని కథ చూస్తే భస్మాసుర హస్తం’ అని ఎద్దేవా చేశారు.
ఎన్నికల ముందేమో హామీల వరద.. వాటిపై మేము గట్టిగా మాట్లాడితే మాపై బూతుల బురద. నిన్ననేమో డిక్లరేషన్ల మోత.. ఇప్పుడు ఎగవేతల జాత.. గ్యారెంటీలు తాటాకంత.. అమలు చేసింది చింతాకంత.. ఇస్తామన్నది ఏనుగు.. ఇచ్చిందేమో ఎలుక.. పని చారానా.. ప్రచారం బారానా.. ఇదీ వీళ్ల పనితీరు’
-కేటీఆర్
‘ఇది పేరుకే ప్రజాపాలన. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అంటూ 1.25 కోట్ల మంది పేదల నుంచి ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నరు. ఎక్కడికి పోయాయి ఆ దరఖాస్తులు? ఎఫ్ఎస్ఎల్ అగ్నిప్రమాదాల్లో కీలకమైన కొన్ని ఆధారాలతో పాటు ఇవి కూడా కాలిపోయినయా?’ అని కేటీఆర్ నిలదీశారు. ‘టీ 20 వరల్డ్ కప్ ఇండియా గెలిస్తే.. 420 వరల్డ్ కప్ పెడితే.. వీళ్లే గెలుస్తరు. అందులో ఎలాంటి అనుమానం లేదు’ అంటూ దెప్పిపొడిచారు. ‘ఒకసారి మీ మ్యానిఫెస్టో మీరే చదువుకోండి. వాటిల్లో ఎన్ని పూర్తి చేశారు? ఎన్ని పూడ్చివేశారు? ఎన్నింటిని బొందపెట్టారు? ఎన్నింటికి మంగళం పాడారు? ఒక్కసారి మీరైనా చెప్పండి అధ్యక్షా’ అంటూ ధ్వజమెత్తారు.
‘తాను కర్ణుడులాంటి వాడిని అని ముఖ్యమంత్రి అన్నారు. ఎన్నికల ముందు కర్ణుడు.. ఓట్లు పడ్డాక కుంభకర్ణుడు అయ్యాడు. ఇంత వరకూ పత్తా లేడు’ అని కేటీఆర్ ఎద్దేవాచేశారు. ‘భారతదేశ ఎన్నికల చరిత్రలోనే కాదు.. ప్రపంచ ఎలక్షన్ హిస్టరీలోనే ఇదే అతిపెద్ద మోసం. అదే 420 హామీలు ఇచ్చి మోసం చేసిన మ్యానిఫెస్టో ఎక్కడా లేదనేది వాస్తవం. మ్యానిఫెస్టోలే కాదు, వరంగల్, కామారెడ్డి, చేవెళ్ల డిక్లరేషన్లు ఇచ్చిండ్రు. ఢిల్లీ నుంచి విమానాల్లో వచ్చి ప్రమాణాలు చేసి వెళ్లిండ్రు. గల్లీగల్లీలో గ్యారెంటీ కార్డులు పంచిన ఢిల్లీ బ్యాచ్ పత్తా లేదు. అధిష్ఠాన పెద్దల దర్శనభాగ్యం కోసం పదే పదే ఢిల్లీ యాత్రలు చేస్తున్నరు. సమావేశాలు, సమీక్షలు, ఆఖరికి క్యాబినెట్ మీటింగ్‌లు కూడా ఢిల్లీలోనే జరుగుతున్నయి’ అని దుయ్యబట్టారు. ‘ఇక్కడ జనం తెలుగులో తమ ఆవేదన వెళ్లబోసుకుంటుంటే.. కాంగ్రెస్ నాయకులేమో మలయాళం, మరాఠీ, బీహారీ, హిందీ భాషల్లో తమ గొప్పులు చెప్పుకొంటున్నారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో ఇతర రాష్ర్టాల ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
తొలి క్యాబినెట్లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి సంతకం చేశారని చెప్పిండు. మరి ఆ ఫైల్ ఏమైంది? ప్రజల సాక్షిగా బహిరంగ వేదికపై ఏకంగా సీఎం సంతకం చేసిన ఫైల్ మాయమైపోతే ఎట్ల? దీనిపై ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయండి. ముఖ్యమంత్రి సంతకానికే దికులేకుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎట్లా నమ్ముతరు? ఇది జీవో వాల్యూ సర్కార్.. జీరో వాల్యూ సీఎం.
-కేటీఆర్
రూ.4వేల పెన్షన్ కోసం ఎదురుచూసి విసిగి వేసారిన 46 లక్షల మంది ధన్యవాదాలు చెప్పాల్నా?
రూ.6 వేల పెన్షన్ కోసం అలసిపోయిన 5 లక్షల మంది దివ్యాంగులు ధన్యవాదాలు చెప్పాల్నా?
యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులు ధన్యవాదాలు చెప్పల్నా?
నెలకు రూ.2,500 ఇస్తారని ఎదురుచూస్తున్న 1,68,00,000 మంది ఆడబిడ్డలు ధన్యవాదాలు చెప్పాల్నా?
రూ.4 వేల నిరుద్యోగ భృతి అన్నారు? 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామన్నారు? ఆ నిరుద్యోగ సోదరులు మీకు ధన్యవాదాలు చెప్పాల్నా?
డీఏలు రాక, పీఆర్సీ లేక, బెనిఫిట్స్ అందక నరక యాతనపడుతున్న 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్‌దారులు, ఔట్ సోర్సింగ్ సోదరులు మీకు ధన్యవాదాలు చెప్పాల్నా?
విషాహారంతో చనిపోతూ.. పురుగుల అన్నం తింటున్న లక్షలాది మంది విద్యార్థులు మీకు ధన్యవాదాలు చెప్పాల్నా?