హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : శాసనమండలిలో సభ్యులుకాని వారి పేర్లను సభలో ప్రస్తావించడం సభా సంప్రదాయం కాదని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పష్టంచేశారు. మంగళవారం మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ సందర్భంగా టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్లను ప్రస్తావించారు. డ్రగ్స్ పరీక్షలు నిర్వహించేందుకు తాను సీఎం రేవంత్‌రెడ్డిని తీసుకొస్తానని, బీఆర్ఎస్ సభ్యులు కూడా ప్రతిపక్షనేత కేసీఆర్, కేటీఆర్‌ను టెస్టులకు తీసుకురావాలని మాట్లాడారు. మహేశ్‌కుమార్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అ భ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి స్పందించి.. రెండున్నరేండ్లుగా అసెంబ్లీ ప్రాంగణంలో మండలి సమావేశాలు నిర్వహించాలని కోరుకుంటున్నామని, ఇప్పటికి అది నెరవేరిందని తెలిపారు. అదే స్ఫూర్తితో మండలి లో అర్థవంతమైన చర్చలు చేపట్టి ఆదర్శంగా నిలిచేలా సభ్యులు వ్యవహరించాలని సూచించారు. సభలో సభ్యులుకాని వారి గురించి, సభలో లేని వ్యక్తులపై విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం స భా సంప్రదాయం కాదని సూచించారు.
అసెంబ్లీ ప్రాంగణంలో నూతనంగా ప్రారంభించిన మండలి కొత్త భవనంలో మంగళవారం తొలిరోజు సమావేశాల సందర్భంగా జర్నలిస్టులు, అధికారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. కొత్త భవనంలోని మొదటి ఫ్లోర్లో జర్నలిస్టుల గ్యాలరీ ఏర్పాటుచేశారు. ఈ గ్యాలరీ నుంచి జర్నలిస్టులు సభలో జరిగే చర్చకు సంబంధించిన వ్యవహారాలను రిపోర్ట్ చేస్తారు. అయితే, సభలో సభ్యుల మధ్య జరిగే చర్చ మొదటి ఫ్లోర్లో ఉన్న జర్నలిస్టులకు వినిపించడం లేదు. దీంతో గ్యాలరీలోని జర్నలిస్టులు తమ ఎదురుగా ఉన్న టీవీల్లో చూసి వార్త సేకరించాల్సి వస్తోంది. దీంతో సమ స్యపై స్పందించిన ఆయన.. త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
హైదరాబాద్, మార్చి 17(నమస్తే తెలంగాణ) : మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను నిర్వాసితులను చేయొద్దని ఎంఐఎం ఎమ్మెల్యే బలాలా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తప్పనిసరిగా తొలగించాల్సి వస్తే బాధితులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించాకే ఆ ఇండ్లను స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. మూసీ ప్రాజెక్టు ఆర్థిక ప్రణాళికతోపాటు సమగ్ర సమాచారాన్ని సభ ముందుంచాలని కోరారు. బడ్జెట్లో ఓల్డ్‌సిటీకి రూ.5,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. మంగళవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో బలాలా మాట్లాడారు. హైడ్రాకు ఉన్న చట్టబద్ధమైన అధికారాలను సభ ముందు ఉంచాలని కోరారు. హైడ్రా ద్వారా 1,000 ఎకరాల కన్నా అధికంగా ప్రభుత్వ భూములు, చెరువులను కబ్జాల నుంచి విముక్తి కల్పించినట్టు గవర్నర్ ప్రసంగంలో పేర్కొన్నారని, కానీ, హైడ్రా చర్యల్లో ఎక్కడా పారదర్శకత, జవాబుదారీతనం కనిపించడం లేదని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేయడంతోపాటు కొత్తగా క్యూర్ చట్టాన్ని తెస్తున్నట్టు, వాటర్ బోర్డు, హైడ్రా తదితర సంస్థలను ఒకే చట్రం కిందికి తెచ్చేలా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారని, దీనిపై కూడా సభలో సమగ్రంగా చర్చించాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, బకాయిలపై చర్చించాలని కోరుతూ మంగళవారం శాసనసభలో బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు, సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావుతోపాటు ఇతర సభ్యులు ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను, అలాగే, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను తెలంగాణలో అమలుచేయాలని కోరుతూ బీజేపీ పక్ష ఉప నేత పాయల్ శంకర్ ఇచ్చిన వాయిదా ప్రతిపాదనను స్పీకర్ తిరస్కరించారు.అనంతరం సభను బుధవారానికి వాయిదా వేశారు.