Jeevan Reddy | జగిత్యాల, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : పదిమంది ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లగొట్టాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. నలభై ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న తాను ఇప్పుడు విడిచిపెట్టే పరిస్థితి వచ్చిందంటే దానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కారకుడని, అందుకు కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా బాధ్యత ఉన్నదని అన్నారు. మంగళవారం ఆయన జగిత్యాలలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన పార్టీని వీడిపోవాలని ఎవరూ అనుకోరని అన్నారు. సంజయ్‌కుమార్ అసలు ఏ పార్టీలో ఉన్నారో ఆయనకు తెలుసా? అని ప్రశ్నించారు. సంజయ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని స్పీకర్ ప్రకటిస్తే.. సంజయ్ తనతో కలిసి పనిచేస్తాననడం ఏంటని నిలదీశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉడుం సొచ్చినట్టు సొచ్చాడని, ఉడుం సొచ్చిన ఇంటిని వదిలిపెట్టక తప్పదని పేర్కొన్నారు.
అభివృద్ధి కోసం ముఖ్యమంత్రితో కలిసి పని చేస్తున్నానని ఎమ్మెల్యే మాటిమాటికి అంటున్నారని, ఇది వినడానికి విడ్డూరంగా ఉన్నదని అన్నారు. అభివృద్ధి కోసం కలిసి పనిచేయడమంటే కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో కల్పించుకోవడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేయడం, నామినేటెడ్ పోస్టుల భర్తీలో వేలుపెట్టడమా? అని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినా.. గెలువకపోయినా ప్రజాసంక్షేమం కోసం, జగిత్యాల అభివృద్ధి కోసం పనిచేసినట్టు తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రజా గొంతుకను వినిపించినట్టు చెప్పారు. 2014లో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అప్పటి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి, బోర్నపెల్లి వంతెనకు రూ.70 కోట్లు మంజూరు చేయించిన విషయాన్ని గుర్తుచేశారు. పార్టీ అధిష్ఠానం కలుగజేసుకుంటే రాజీనామా యోచనను విరమించుకుంటారా? అని విలేకరులు అడగ్గా.. జగిత్యాలలో ఉత్పన్నమైన సమస్యకు పరిషారం కన్పించడం లేదని అన్నారు.
ఏం చేస్తే పార్టీ నుంచి వెళ్లకుండా ఉంటారని విలేకరులు అడిగిన మరో ప్రశ్నకు సమాధానంగా.. రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, వారందరికి పార్టీతో సంబంధం లేదని ప్రకటించడంతోపాటు వారికి పార్టీ కార్యకలాపాల్లో భాగం లేకుండా చూడాలని కోరారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి సీఎం అయ్యారు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయ్యారని తెలిపారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన సమయంలో ఎమ్మెల్సీగా ఉన్న తనకు ఇరవై నెలల గడువు ఉన్నదని, ఏకైక ఎమ్మెల్సీగా పనిచేసిన తనకు మంత్రి పదవి పొందేందుకు అర్హత లేదా? అని ప్రశ్నించారు. పదవులు వచ్చి నా.. రాకపోయినా.. ఆత్మగౌరవం, ప్రతి ఒక్కరికీ దక్కాల్సిందేనని స్పష్టంచేశారు. కార్యకర్తలు, నాయకులు, అనుచరులతో చర్చలు జరుపుతున్నానని, శ్రీరామ నవమి తర్వాత సమావేశం ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీని వీడే అంశంపై స్పష్టత ఇస్తానని తెలిపారు.