KTR : భారత రాజ్యాంగంపైన, సుప్రీంకోర్టుపైన బీజేపీకి ఏమాత్రం గౌరవం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. పహల్గాం మారణకాండకు కారణమైన పాకిస్తాన్తో క్రికెట్ ఆడటం బీజేపీ కపట దేశభక్తికి నిదర్శనమని మంగళవారం ఉదయం కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బీఆర్ఎస్ స్వాగతించడాన్ని బీజేపీ విమర్శిస్తోంది. బీజేపీది నకిలీ జాతీయవాదమని, తమది ఆచరణలో, ఆత్మలో నిజమైన జాతీయవాదమని స్పష్టంచేశారు. కులం, మతం, వర్గం చూడకుండా ప్రతి భారతీయుడిని సమానంగా ఆదరించడమే తమ దృష్టిలో నిజమైన జాతీయవాదం అన్నారు. జాతీయవాదానికి, దురహంకార దేశభక్తికి మధ్య ఉన్న తేడాను తెలుసుకోవడమే అసలైన దేశభక్తి అని చెప్పారు. పహల్గాం దారుణ మారణకాండకు కారణమైన పాకిస్తాన్తో క్రికెట్ ఆడించిన బీజేపీకి బీఆర్ఎస్ దేశభక్తి గురించి ప్రశ్నించే నైతిక అర్హత లేదని విమర్శించారు.
పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిలో మరణించిన 26 మంది అమాయకుల నెత్తురు తడి ఇంకా ఆరకముందే ఆ దేశంతో క్రికెట్ ఆడేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒప్పుకోవడం ఆ పార్టీ నకిలీ జాతీయవాదం, కపట దేశభక్తికి తిరుగులేని సాక్ష్యం అన్నారు. పహల్గాం బాధిత కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించినా ఏ మాత్రం పట్టించుకోకుండా కోట్లాది భారతీయులను మోదీ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆరోపించారు.