Peddapalli Town | పెద్దపల్లి కమాన్, అక్టోబర్ 5 : పెద్దపల్లి మున్సిపల్ అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం పట్టణంలోని 30వ వార్డు ప్రజలకు శాపంగా పరిణమించింది. వర్షపు నీరు రోడ్డుపైనే నిలుస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షానికే కాలనీలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. కనీసం కాలి నడకన కూడా వెళ్లలేకపోతున్నామని ప్రజలు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.
పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ముందు మూన్ ఫంక్షన్ హాల్ వీధిలో వర్షం పడినప్పుడల్లా మోకాళ్లలోతు నీళ్లు నిలుస్తున్నాయి. డ్రైనేజీ పొంగిపొర్లుతూ ఇండ్లు, షాపుల్లోకి మురుగు నీరు చేరుతూ దుర్వాసన వస్తున్నదని కాలనీవాసులు మండిపడుతున్నారు. ఈ రోడ్డు ఇలా మారడానికి కారణం ఇటీవల జెండా చౌరస్తా నుంచి నెహ్రూ విగ్రహం వరకు విస్తరించిన రోడ్డు పనులేనని విమర్శలు వినిపిస్తున్నాయి.
కాగా రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఎత్తు పల్లాలను సరిచూసుకోకుండానే ఇష్టారీతిలో అస్తవ్యస్తంగా తారురోడ్డు వేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఎస్బీఐ, యూనియన్, ఇండియన్ బ్యాంకులతోపాటు మూన్ ఫంక్షన్ హాల్ వీధిలో వర్షపు నీటితోపాటు డ్రైనేజీలోని మురుగు రోడ్లపై ప్రవహిస్తున్నదని ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి మురుగునీరు రోడ్డు పై నిలువకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
Harish Rao | కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లారా జాగ్రత్త.. హరీశ్‌రావు వార్నింగ్
YS Jagan | ప్రతి 3 బాటిళ్లలో ఒకటి కల్తీ మందే.. వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు