Garlic Peel | వెల్లుల్లిని మనం నిత్యం వంటల్లో వేస్తూనే ఉంటాం. దీన్ని అనేక కూరల్లో వాడుతారు. వెల్లుల్లిని వేస్తే వంటకాలకు చక్కని రంగు, రుచి, వాసన వస్తాయి. వెల్లుల్లిని కొందరు నేరుగా పచ్చిగా తినేందుకు సైతం ఆసక్తిని చూపిస్తుంటారు. అయితే కేవలం వెల్లుల్లి మాత్రమే కాదు, దాని పొట్టు కూడా మనకు ఎంతగానో పనిచేస్తుంది. వెల్లుల్లి రెబ్బలను ఒలిచిన తరువాత అందరూ పొట్టు పడేస్తారు. కానీ ఆ పొట్టులోనూ అనేక ఔషధ గుణాలు ఉంటాయి. వెల్లుల్లి పొట్టులో అనేక పోషకాలు ఉంటాయి. అయితే వెల్లుల్లి పొట్టును ఎలా వాడాలి.. ఎలా తీసుకోవాలి.. అని సందేహిస్తుంటారు. ఇందుకు పోషకాహార నిపుణులు ఏమంటున్నారంటే.. వెల్లుల్లి పొట్టును బాగా శుభ్రం చేసి ఎండ బెట్టి పొడి చేసి దాన్ని కూరల్లో, మీరు తినే ఆహారాల్లో పైన చల్లి ఉపయోగించుకోవచ్చు. లేదా వెల్లుల్లి పొట్టును నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను వడకట్టి తాగవచ్చు. ఇలా ఏ రూపంలో వెల్లుల్లి పొట్టును తీసుకున్నా అనేక లాభాలు కలుగుతాయి.
వెల్లుల్లి పొట్టులో ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ సమ్మేళనాలు అని పిలవబడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తాల్లో ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్‌ను తొలగిస్తాయి. దీని వల్ల వృద్ధాప్య ఛాయలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారు. చర్మం కాంతివంతంగా మారుతుంది. వెల్లుల్లి పొట్టులో ఉండే ఫినైల్ ప్రొపనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. గుండె పోటు రాకుండా చూస్తుంది. ఈ పొట్టులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర సమ్మేళనాలు యాంటీ ఇన్ ఫ్లామేటరీ గుణాలను సైతం కలిగి ఉంటాయి. కనుక వెల్లుల్లి పొట్టును తీసుకుంటే శరీరంలో అంతర్గతంగా, బాహ్యంగా ఉండే వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్ ఉండే వారికి మేలు జరుగుతుంది. కీళ్ల నొప్పులు, వాపుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వెల్లుల్లి పొట్టులో ఉండే సమ్మేళనాలు, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయని సైంటిస్టుల పరిశోధనల్లో తేలింది. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వెల్లుల్లి పొట్టులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తాయి. దీని వల్ల శరీరం ఇన్ఫెక్షన్లు, రోగాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది. వెల్లుల్లి పొట్టులో యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో తేలింది. కనుక దీన్ని తీసుకుంటే క్యాన్సర్ కణాలు పెరగకుండా చూసుకోవచ్చు. క్యాన్సర్ల నుంచి రక్షణ లభిస్తుంది. వెల్లుల్లి పొట్టును తీసుకోవడం వల్ల శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ నియంత్రణలో ఉంటుంది. హైబీపీ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
వెల్లుల్లి పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మొత్తాల్లో ఉంటాయి కనుక షుగర్ లెవల్స్‌ను నియంత్రించడంలో సహాయం చేస్తాయి. దీని వల్ల డయాబెటిస్ ఉన్నవారికి మేలు జరుగుతుంది. ఈ పొట్టులో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దం వంటి సమస్యలను తగ్గిస్తుంది. వెల్లుల్లి పొట్టులో మెగ్నిషియం, పొటాషియం, క్యాల్షియంలు కూడా స్వల్ప మొత్తాల్లో ఉంటాయి. ఇవి మన శరీరంలో జీవక్రియలు సక్రమంగా నిర్వహించబడేందుకు సహాయం చేస్తాయి. ఇక వెల్లుల్లి పొట్టును ఉపయోగించే ముందు కచ్చితంగా శుభ్రం చేయాల్సి ఉంటుంది. పొట్టులో మట్టి, దుమ్ము ఉండే అవకాశాలు ఉంటాయి. కనుక కచ్చితంగా శుభ్రం చేశాకే దీన్ని ఉపయోగించాలి. వెల్లుల్లి పొట్టు కొందరికి పడదు. అలర్జీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక అలర్జీలు ఉన్నవారు తినకూడదు. ఇలా జాగ్రత్తలను పాటిస్తూ వెల్లుల్లి పొట్టును తింటుంటే అనేక లాభాలను పొందవచ్చు.