US Consulate : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు దాడులకు పాల్పడటం.. అందుకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడులు చేస్తుండటం లాంటి పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోవడాన్ని ఖండిస్తూ పలు దేశాల్లోని అమెరికా రాయబార కార్యాలయాల దగ్గర ఆందోళనలు జరుగుతున్నాయి. పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో అమెరికా కాన్సులేట్ దగ్గర జరిగిన ఘర్షణల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ దగ్గర గచ్చిబౌలి పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నానక్‌రామ్‌గూడలోని యూఎస్ కాన్సులేట్ వద్ద భారీగా బలగాలను మోహరించారు. ఖమేనీ మృతిని నిరసిస్తూ నిరసన ర్యాలీలు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యగా కాన్సులేట్ పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
కాన్సులేట్ వైపు వెళ్లే ప్రధాన రహదారిని తాత్కాలికంగా మూసివేసి బారికేడ్లను ఏర్పాటు చేశారు. అటువైపుగా వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.