Donald Trump : ఇరాన్‌పై దాడుల్ని అమెరికా ఆపేసింది. శాంతిప్రక్రియ అనంతరం ఇరాన్‌పై అమెరికా వరుసగా 13 రోజులపాటు దాడులు చేసింది. తాజాగా శుక్రవారం నుంచి ఈ దాడుల్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిలిపివేశారు. ఈ అంశంపై అమెరికా అధికారులు స్పందించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలకు అవకాశం ఉండటంతోపాటు, అమెరికా క్షిపణుల నిల్వలు తగ్గిపోవడం వంటివి కారణాలుగా అధికారులు అభిప్రాయపడ్డారు.
ఇదే సమయంలో ఇంకా యుద్ధం కొనసాగించడం వల్ల ఈ సంక్షోభం ఇంకా పెరుగుతుందనే భావనతోనే యుద్ధాన్ని నిలిపివేసినట్లు చెబుతున్నారు. దీనిపై ట్రంప్ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై దాడులు చేయొద్దని ట్రంప్ మిలిటరీని ఆదేశించారు. అప్పటికే దాడులపై రూపొందించిన ప్రణాళికల్ని రద్దు చేయాలని సూచించారు. చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అయితే, ఈ అంశంపై వైట్‌హౌజ్ కార్యాలయం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ, ఈ సంక్షోభాన్ని నివారించేందుకు ట్రంప్ ద్వైపాక్షిక చర్చలకు కట్టుబడి ఉన్నారని, అయినప్పటికీ ఒకవేళ ఇరాన్ కనుక మళ్లీ దాడులకు దిగితే సైనిక చర్యకు వెనుకాడవద్దని ట్రంప్ ఆదేశించినట్లు వైట్‌హౌజ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఇరాన్‌తో చర్చలకు అవకాశం కల్పించాలని, అందుకుతగ్గ వాతావరణాన్ని సృష్టించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఒకవేళ చర్చలు మళ్లీ విఫలమైతే దాడులు తప్పవని ఆయన హెచ్చరించారు. మరోవైపు మిస్సైల్స్ నిల్వలు క్షీణిస్తుండటం కూడా ఇరాన్‌తో దాడులు నిలిపివేతకు కారణం అని తెలుస్తోంది. దాడులు మరికొన్ని రోజులు కొనసాగితే, క్షిపణుల నిల్వలు తగ్గిపోయే ప్రమాదం ఉంది. మిడిల్ ఈస్ట్ దేశాల్లో నిల్వలు తగ్గిపోతున్నాయని సీనియర్ మిలిటరీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.