Srinivas Goud | తుంగభద్రపై అక్రమంగా డ్యామ్‌లు కడుతున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కృష్ణా, భీమా ప్రాజ్టెల నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఫ్యూచర్లో తెలంగాణకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణా, భీమా నదులపై కర్ణాటక కడుతున్న అక్రమ ప్రాజెక్టుల సందర్శనకు మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ బృందం వెళ్లింది. కర్ణాటకలోని గూడూరు వద్ద కృష్ణానదిపై అక్రమంగా ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ గేట్లను పరిశీలించింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కర్ణాటకలోని ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిపోయాయని తెలిపారు. తెలంగాణలో నీళ్లు లేక భూములు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. తుంగభద్రలో సిల్ట్ తీయక పూడికతో నిండిపోయిందని చెప్పారు. శ్రీశైలం నుంచి ఎప్పుడైనా నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చన్నారు.
ఇరిగేషన్ శాఖకు సలహాదారుడిగా తెలంగాణ ద్రోహిని నియమించారని రేవంత్ సర్కార్‌పై శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు 10 శాతం పనులు పూర్తి చేయట్లేదని అన్నారు. అక్రమ ప్రాజెక్టులు అడ్డుకోకపోతే మనకు నీళ్లు ఉండవని చెప్పారు. హైడ్రాలిక్ గేట్లు పెట్టి చుక్క నీరు రాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హైడ్రాలిక్ గేట్లు వెంటనే తీసేయాలని డిమాండ్ చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తికాకపోతే పాలమూరు ఎండిపోతుందని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నీళ్లు వదలకపోతే పాలమూరు ప్రజలు చూస్తూ ఊరుకోరని అన్నారు. తుంగభద్ర డ్యాంలో తెలంగాణకు కూడా హక్కు ఉందని పేర్కొన్నారు. కనీసం నాలుగు టీఎంసీల నీటిని కిందకు వదలాలని డిమాండ్ చేశారు. నీళ్లు ఇచ్చేవరకూ తెలంగాణ ప్రజల పట్ల పోరాడతామని స్పష్టం చేశారు.