PMOS | పాలీఎండోక్రైన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ (PMOS), గతంలో పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (PCOS)గా పిలిచే ఈ పరిస్థితి, సంతానోత్పత్తి వయస్సులో ఉన్న మహిళలను ప్రభావితం చేసే ఒక హార్మోన్ల సంబంధిత సమస్య. ఇందులో నెలసరి సక్రమంగా రాకపోవడం, ఆండ్రోజెన్ (పురుష హార్మోన్లు) స్థాయిలు పెరగడం, అండాశయాల్లో చిన్న చిన్న సిస్ట్లు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా బరువు పెరగడం, గర్భం దాల్చడంలో ఇబ్బందులు, ముఖం లేదా శరీరంపై అధిక రోమాలు పెరగడం, మొటిమలు వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. PMOS ఉన్న మహిళల్లో టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం గణనీయంగా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే శరీర కణాలు ఇన్సులిన్‌కు సరిగా స్పందించకపోవడం. సాధారణంగా ఇన్సులిన్ రక్తంలోని గ్లూకోజ్‌ను కణాల్లోకి చేర్చి శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. కానీ PMOSలో కణాలు ఇన్సులిన్ ప్రభావానికి స్పందించకపోవడంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది.
PMOSలో శరీర కణాలు ఇన్సులిన్‌కు తగిన విధంగా స్పందించకపోవడం వల్ల గ్లూకోజ్‌ను శక్తిగా ఉపయోగించలేవు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ప్యాంక్రియాస్ (క్లోమగ్రంథి) మరింత ఎక్కువ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయాల్సి వస్తుంది. ఈ పరిస్థితి దీర్ఘకాలం కొనసాగితే చివరికి టైప్ 2 డయాబెటిస్‌కు దారితీసే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. PMOSలో కనిపించే హార్మోన్ల అసమతుల్యత కూడా మధుమేహ ప్రమాదాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఆండ్రోజెన్ హార్మోన్లు అధికంగా ఉండటం వల్ల శరీర జీవక్రియ దెబ్బతిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. బరువు పెరగడం లేదా ఊబకాయం కూడా PMOSతో ముడిపడి ఉండే ప్రధాన సమస్య. అధిక బరువు ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను మరింత పెంచి మధుమేహం వచ్చే అవకాశాన్ని ఎక్కువ చేస్తుంది. అలాగే PMOSలో శరీరంలో ఇన్ఫ్లమేషన్ (వాపు) స్థాయిలు కూడా అధికంగా ఉండటం వల్ల జీవక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
PMOS వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇది రక్తపోటు, కొవ్వు పదార్థాల అసమతుల్యత, రక్తంలో చక్కెర పెరగడం వంటి సమస్యల సమాహారం. ఈ పరిస్థితి గుండె జబ్బులు, పక్షవాతం, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణంగా ప్యాంక్రియాస్ నిరంతరం ఎక్కువ ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయాల్సి రావడంతో కాలక్రమేణా అది అలసిపోతుంది. చివరికి అవసరమైనంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేక రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి టైప్ 2 డయాబెటిస్ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. PMOS ఉన్న మహిళల్లో అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు, రక్తపోటు వంటి ఇతర జీవక్రియ సమస్యలు కూడా తరచూ కనిపిస్తాయి. ఇవి మధుమేహంతోపాటు గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి.
అయితే సరైన ఆహారం, జీవనశైలి మార్పుల ద్వారా PMOS నుంచి మధుమేహానికి దారితీసే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) కలిగిన, పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. కినోవా, ఓట్స్, పప్పుధాన్యాలు, ఆకుకూరలు, పీచు ఎక్కువగా ఉండే కూరగాయలు వంటి ఆహారాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. తెల్ల బ్రెడ్, మిఠాయిలు, చక్కెర పానీయాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను తగ్గించడం అవసరం. కార్బొహైడ్రేట్లతోపాటు ఆరోగ్యకరమైన కొవ్వులు లేదా ప్రోటీన్ ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా ఉంటుంది.
క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా చాలా ముఖ్యం. వారానికి కనీసం రెండు రోజులు బలం పెంచే వ్యాయామాలు (స్ట్రెంగ్త్ ట్రైనింగ్), అలాగే వారానికి 120 నుంచి 150 నిమిషాల పాటు వేగంగా నడక, సైక్లింగ్ లేదా ఇతర కార్డియో వ్యాయామాలు చేయడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. శరీర బరువులో కేవలం 5 నుంచి 10 శాతం తగ్గినా జీవక్రియ ఆరోగ్యంలో గణనీయమైన మెరుగుదల కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పరీక్షించుకోవడం, ఇన్సులిన్ సెన్సిటివిటీని పర్యవేక్షించడం, వైద్యుల సలహా మేరకు చికిత్స తీసుకోవడం అవసరం. అలాగే ఒత్తిడిని యోగా, ధ్యానం వంటి పద్ధతులతో తగ్గించుకోవడం, ప్రతిరోజూ తగినంత నాణ్యమైన నిద్రపోవడం కూడా హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. PMOS ఉన్న మహిళలు ప్రతి సంవత్సరం ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లేదా HbA1c పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలను కూడా క్రమం తప్పకుండా చేయించుకోవడం ద్వారా గుండె సంబంధిత ప్రమాదాలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. సరైన జీవనశైలి, సమతుల్య ఆహారం, క్రమం తప్పని వైద్య పరీక్షలతో మధుమేహ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.