ఖమ్మం, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదల బతుకులు దినదిన గండంగా మారాయని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షు డు, ఎమ్మెల్సీ తాతా మధు ఆవేదన వ్యక్తం చేశారు. ‘తమది ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలనలో పేదలకు అస లు జీవించే హక్కు లేదా?’ అని ప్రశ్నించారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో బడుగుల ఇండ్లను కూల్చివేశారని, రియల్ఎస్టేట్ వ్యాపారం కోసం లగచర్లలో గిరిజన బిడ్డల భూములను లాక్కున్నారని, ఇప్పుడు గాంధీ సరోవర్ మూసీ సమీపంలోని వేలాది గృహాలను నేలమట్టం చేసేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఖమ్మం వెలుగుమట్ల భూములపైనా కన్నేశారని, అందుకే అక్క డి పేదలపై దాష్టీకానికి దిగారని ఆరోపించా రు. భూదాన్ పట్టాల తో పదేండ్లుగా జీవిస్తున్న పేదలపైకి, వారి ఇండ్లపైకి బుల్డోజర్లను పంపారని, పేదలను ఈడ్చిపడేశారని ధ్వజమెత్తారు. బుల్డోజర్లతో ఇండ్లను కూల్చడం ప్రజాస్వామానికే సిగ్గుచేటని విమర్శించారు. హామీలను నెరవేర్చలేక బీఆర్ఎస్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నదని దుయ్యబట్టారు.
కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయండి
ఖమ్మంలో గురువారం జరుగనున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయాలని తాతా మధు కోరారు. ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్లలో కాంగ్రెస్ సర్కార్ కూల్చివేసిన పేదల ఇండ్లను కేటీఆర్ పరిశీలిస్తారని, రోడ్డు మీదికి విసిరేసిన పేదలను పరామర్శిస్తారని తెలిపారు. కేటీఆర్‌తోపాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు సైతం బాధితులను కలువనున్నట్టు వెల్లడించారు.