న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. విదేశాలకు పారిపోయిన సుమారు 274 మంది నేరగాళ్ల(Fugitives)ను ఇండియాకు తీసుకువచ్చినట్లు చెప్పింది. గడిచిన ఏడేళ్లలో సుమారు 36 దేశాల నుంచి ఆ మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లను పట్టుకువచ్చినట్లు వెల్లడించింది. దీంట్లో మర్డరర్లు, గ్యాంగ్స్టర్లు, బెదిరింపులకు పాల్పడినవాళ్లు, ఉగ్రవాదులు ఉన్నారు. సగటున ప్రతి ఏడాది 39 మంది మోస్ట్ వాంటెడ్ నేరగాళ్లను విదేశాల నుంచి పట్టుకువచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలన సమయంలో కన్నా ఎక్కువ సంఖ్యలో నేరగాళ్లను ఇండియాకు తీసుకువచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దీనికి సంబంధించిన డేటాను షేర్ చేశారు. పాత వ్యవస్థలో ఉన్న లోపాలను కొత్త చట్టాలతో పరిష్కరించామన్నారు. భారత్‌కు పట్టుకువచ్చిన వారిలో హత్యలు, తీవ్ర హింసకు పాల్పడినవారు 62 మంది ఉన్నట్లు కేంద్ర హోంశాఖ చెప్పింది. వ్యవస్థీకృత నేరాలు, బెదిరింపులకు పాల్పడినవారు 42 మంది ఉన్నారు. ఇక 53 మంది లైంగిక దాడులకు పాల్పడినవారున్నారు. 17 మంది ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు కేంద్రం తన ప్రకటనలో చెప్పింది.
భారత్ పోల్‌ను లాంచ్ చేశామని, ప్రపంచవ్యాప్తంగా సుమారు 1400 ఏజెన్సీలతో కనెక్ట్ అయ్యామని, దీంట్లో ఇంటర్‌పోల్ కూడా ఉందని హోంశాఖ తన ప్రకటనలో చెప్పింది. నేరగాళ్ల సమాచారాన్ని కేవలం 3 నుంచి 10 రోజుల్లోనే అన్ని దేశాలతో పంచుకుంటున్నట్లు పేర్కొన్నది. విదేశాలకు పారిపోయిన నేరగాళ్ల నుంచి 2019-2026 మధ్యకాలంలో మనీల్యాండరింగ్ చట్టం కింద సుమారు 17,874 కోట్లు రికవరీ చేసినట్లు హోంశాఖ తెలిపింది. ఆర్థికనేరగాళ్లకు చెందిన సుమారు 18,762 కోట్లను కూడా మళ్లీ రెస్టిట్యూట్ చేసినట్లు ప్రభుత్వం చెప్పింది. గత ఏడేళ్లలో రెడ్‌కార్నర్ నోటీసులు జారీ చేసే సంఖ్యను కూడా పెంచినట్లు ప్రభుత్వం పేర్కొన్నది.