Hyderabad Women Missing | దుబాయ్‌లో హైదరాబాద్ యువతి మిస్సింగ్ కలకలం రేపుతోంది. గత కొద్ది నెలలుగా ఆమె నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ.. సమాచారం కానీ లేకపోవడంతో ఆందోళన చెందిన ఆమె కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీకి చెందిన ఓ కుటుంబ పెద్ద మృతిచెందడంతో ఆ కుటుంబం ఆర్థికంగా బాగా చితికిపోయింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తన కుటుంబాన్ని పోషించేందుకు వైద్య విద్య పూర్తి చేసిన ఓ యువతి (24) ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లింది. గత ఏడాది ఆగస్టులో దుబాయ్‌కు వెళ్లిన ఆమె అక్కడి ఓ ఆస్పత్రిలో విధుల్లో చేరింది.
దుబాయ్ వెళ్లిన తర్వాత సదరు యువతి కొంతకాలం పాటు కుటుంబసభ్యులతో ఫోన్లో మాట్లాడేది. అయితే గత నాలుగు నెలలుగా ఆమె నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఆమె రెండు ఫోన్లకు కాల్ చేసినా పనిచేయడం లేదు. దీంతో కంగారుపడిపోయిన కుటుంబసభ్యులు దుబాయ్‌లో ఉన్న తెలిసి వారి ద్వారా ఆరా తీశారు. అయినప్పటికీ యువతి ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే యువతి కుటుంబసభ్యులు శంషాబాద్‌లోని ఆర్జీఐఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు.