ఆడ బిడ్డ పుడితే తులం బంగారం
ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై చర్చలు కొనసాగుతుండగానే మిత్రపక్షం కాంగ్రెస్‌కు సమాజ్‌వాదీ పార్టీ మరో ఝలక్ ఇచ్చింది. గురువారం ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించింది.
- నిరుద్యోగులకు 5 వేల భృతి
- 25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
- రైతులకు రుణ మాఫీ.. కనీస మద్దతు ధరలకు చట్టబద్ధ హామీ
- మ్యానిఫెస్టోలో ఎస్పీ వాగ్దానాలు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపుపై చర్చలు కొనసాగుతుండగానే మిత్రపక్షం కాంగ్రెస్‌కు సమాజ్‌వాదీ పార్టీ మరో ఝలక్ ఇచ్చింది. గురువారం ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించింది. ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేస్తూ ఆడబిడ్డ పుడితే తులం బంగారం, ఐదేండ్లలో 25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.5 వేల భృతి, తక్షణ రైతు రుణమాఫీ, 23 పంటలకు, పాలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)పై చట్టపరమైన హామీ వంటి హామీలను గుప్పించారు.
దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న(బీపీఎల్) ప్రజలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా, మూతపడిన 26,000 పాఠశాలలను తిరిగి తెరవడం, 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌ల పంపిణీ పథకాన్ని పునరుద్ధరించడం వంటి హామీలను కూడా ఈ మ్యానిఫెస్టోలో పొందుపరిచారు.
ఏటా జాబ్ క్యాలెండర్
నియామక ప్రక్రియల్లో జాప్యం, అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీ భర్తీకి సంబంధించి ఒక వార్షిక క్యాలెండర్‌ను ఆ పార్టీ ప్రతిపాదించింది. ఒకే దశలో పరీక్ష నిర్వహించే నియామక ప్రక్రియలను మూడు నెలల్లోపు, ఒకటి కంటే ఎక్కువ దశలున్న ప్రక్రియలను ఆరు నెలల్లోపు పూర్తి చేయాలని పేర్కొంది. పేపర్ లీకేజీ లేని నియామక వ్యవస్థకు కూడా ఎస్పీ హామీ ఇచ్చింది.
వ్యవసాయానికి ప్రాధాన్యత
రైతుల కోసం ఉత్తర్ ప్రదేశ్‌లోని మొత్తం 23 పంటలు, పాలపై తక్షణ రుణమాఫీ, కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇస్తామని ఎస్పీ వాగ్దానం చేసింది. ఎంఎస్పీ వ్యవస్థ పరిధిలోకి రాని బంగాళదుంపలు, టమోటాలు, ఉల్లిపాయలు వంటి పంటలకు ధరల పరిహార యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. సాగునీటికి ఉచిత విద్యుచ్ఛక్తిని, గ్రామీణ గృహ వినియోగదారులకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్‌ను అందచేస్తామని హామీ ఇచ్చింది. చెరకు రైతులకు 24 గంటల్లోగా చెల్లింపులు అందేలా చూసేందుకు రూ.15,000 కోట్ల కార్పస్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తామని, వాస్తవ సాగు వ్యయం ఆధారంగా చెరకు ధరలను ఏటా పెంచుతామని పేర్కొంది. గ్రామీణ మౌలిక సదుపాయాల కోసం పార్టీ రూ.1.5 లక్షల కోట్లను కూడా పార్టీ ప్రతిపాదించింది.
విద్య, ఆరోగ్య రక్షణ, కులగణన
విద్యా రంగానికి సంబంధించి ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మూసివేసిన 26,000 ప్రాథమిక పాఠశాలలను తిరిగి తెరుస్తామని, అలాగే 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ పథకాన్ని పునరుద్ధరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చింది. రాష్ట్ర జీడీపీలో 5 శాతాన్ని విద్యపై ఖర్చు చేస్తామని కూడా వాగ్దానం చేసింది. ఆరోగ్య సంరక్షణకు సంబంధించి బీపీఎల్ కుటుంబాలకు రూ.10 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ, ప్రభుత్వ దవాఖానలలో పేద, పీడీఏ వర్గాలకు ఉచిత చికిత్స అందచేస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. వివిధ వర్గాల సామాజిక, ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి ఉత్తర్ ప్రదేశ్‌లో కులగణన నిర్వహిస్తామని హామీ ఇచ్చింది.
సమాజ్‌వాదీ క్యాంటీన్లు
ఇతర సామాజిక సంక్షేమ ప్రతిపాదనలతో పాటు రూ.50 కోట్ల వరకు విలువైన ప్రభుత్వ కాంట్రాక్టులలో 50 శాతాన్ని దళిత, పీడీఏ వర్గాలకు కేటాయిస్తామని పార్టీ హామీ ఇచ్చింది. అంతేగాకుండా రాష్ట్రవ్యాప్తంగా సమాజ్‌వాదీ క్యాంటీన్లను ఏర్పాటు చేసి మహిళలకు, పేదలకు, పీడీఏ వర్గాలకు కేవలం రూ.5కే భోజనం అందిస్తామని కూడా హామీ ఇచ్చింది. 2005కు ముందు అమల్లో ఉన్న పాత పింఛను పథకాన్ని(ఓపీఎస్) పునరుద్ధరిస్తామని, ప్రభుత్వ శాఖల్లో అవుట్ సోర్సింగ్‌ను అంతం చేస్తామని వాగ్దానం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

