Harish Rao | ఎవరెవరు అధికారులు పోలీసోళ్లు ఇబ్బంది పెట్టిర్రో వాళ్ళందరి సంగతి చెబుతామని హరీశ్‌రావు హెచ్చరించారు. పోలీసులు, అధికారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పోయిన పదేళ్లు ఊకున్నాం.. ఈసారి అట్లుండదని అన్నారు.ఈసారి అభివృద్ధి చేస్తాం.. ఎక్స్‌ట్రాలు చేసిన అధికారులకు వడ్డీతో సహా చెల్లిస్తామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్లను అరెస్టు చేస్తున్నారని.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లారా జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు.
ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారి మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి మాజీ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు సమక్షంలో బీజేపీ నుంచి పెద్దఎత్తున కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్లో చేరారు. అనంతరం హరీశ్‌రావు మాట్లాడుతూ..రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పన్నులేసుడు తప్ప కొత్తవి ఇచ్చిందేమీ లేదని హరీశ్‌రావు అన్నారు. మళ్లీ భూముల ధరలు పడిపోయాయని తెలిపారు. బీర్ల ధరలు, విస్కీ ధరలు పెంచిండని తెలిపారు. ఆడోళ్లకి ఫ్రీ బస్సు అన్నాడు.. మొగోళ్లకు డబల్ టికెట్ కొడుతున్నారని తెలిపారు. కేసీఆర్ తెచ్చిన పథకాలను బందు పెట్టిండు.. నూట్రిషన్ కిట్టు బందు.. కేసీఆర్ కిట్టు బందు.. బతుకమ్మ చీరలు బంద్ అయినాయన్నారు. కేసీఆర్ ఉండంగా ఎట్ల ఇచ్చిండు.. రేవంత్ రెడ్డి ఎందుకు బంద్ చేసిండు అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డిది కేవలం దోచుకునే ప్రభుత్వమని విమర్శించారు.
మల్ల ఎటు చూసినా కేసీఆర్ రావాలనే గాలి మొదలైందని హరీశ్‌రావు తెలిపారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ప్యాకేజి తెస్తా ప్యాకేజీ తెస్తా అన్నాడు.. రేవంత్ రెడ్డి వచ్చి ప్యాకేజ్ ఇస్తా అన్నాడు అని తెలిపారు. వరదలు వచ్చి రోజులు దాటినా ఒక్క రూపాయి అయినా రేవంత్ రెడ్డి ఇచ్చాడా అని ప్రశ్నించారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 10,000 ఇస్తామన్నారని.. ఒక రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. తొందర్లో కాంగ్రెస్ బాకీ కార్డులు కూడా నియోజకవర్గానికి వస్తాయన్నారు. ప్రతి ఇంటికి బాకీ కార్డులను చేర్చాలని సూచించారు.
ప్రతి అక్కకు చెల్లెకు మహాలక్ష్మి కింద నెలకు 2500 ఇస్తానన్నాడని హరీశ్‌రావు తెలిపారు. 22 నెలలు నిండినై.. ఒక్కొక్క మహిళకు 55 వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడిందని అన్నారు. ఎవరైనా కాంగ్రెస్ వాడు ఊర్లకు వస్తే 55 వేల రూపాయలు ఇచ్చి మాట్లాడండి అని గల్ల పట్టి నిలదీయాలన్నారు. 200 పెన్షన్ 2000 చేసింది కేసీఆర్ అని తెలిపారు. కేసీఆర్ ఇస్తున్న రెండు వేల పెన్షన్‌ను నాలుగు వేలు చేస్తానని రేవంత్ రెడ్డి అన్నాడని గుర్తుచేశారు. అవ్వకిస్తా, తాతకిస్తా, కోడలికిస్తా అన్నాడని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో వృద్ధులకు 44వేల రూపాయలు బాకీ పడిందని అన్నారు.
రైతుబంధు 15వేలు ఇస్తా అన్నారని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 15 వేలు ఇచ్చిందా అని ప్రశ్నించారు. పోయిన యాసంగికి 3 ఎకరాలకు ఇచ్చి మిగితా ఎగ్గొట్టిండని విమర్శించారు. కౌలు రైతుకి ఇస్తా, రైతుకి ఇస్తా అన్నాడని తెలిపారు. రైతుకు లేదు.. కౌలు రైతుకు లేదని అన్నారు. ఒక సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడని.. కానీ 5 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని తెలిపారు. రేవంత్ రెడ్డి అంటే చీఫ్ మినిస్టర్ కాదు.. కటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు. పథకాలు కటింగ్ పెడుతాడు. కేసీఆర్ కట్టిన బిల్డింగ్ లకు రిబ్బన్ కత్తిరిస్తారని అన్నారు. ప్రజలకు పాలేందో నీలేవో తెలిసిపోయిందన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100 సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.