Priyanka Chopra | సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘వారణాసి’పై రోజురోజుకు అంచనాలు పెరుగుతున్నాయి. భారీ బడ్జెట్‌తో పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం జార్జియాలో కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంటోంది. ఈ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాలో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. అలాగే ప్రకాష్ రాజ్, ఆర్. మాధవన్ వంటి అగ్ర నటులు ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం సినిమాకు మరింత బలం చేకూరుస్తోంది.
ఇటీవల ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ చిత్రం ‘ది బ్లఫ్’ను చూసిన మహేష్ బాబు, ఆమె నటనపై ప్రశంసలు కురిపించారు. దీనికి ప్రియాంక “సీ యూ సూన్ ఇన్ అంటార్కిటికా” అంటూ రిప్లై ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ కామెంట్‌తో ‘వారణాసి’ నెక్స్ట్ షెడ్యూల్ అంటార్కిటికాలో జరగనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. విభిన్నమైన లొకేషన్లు, భారీ విజువల్స్ రాజమౌళి సినిమాల ప్రత్యేకత అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే జార్జియా అడవుల్లో యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు అంటార్కిటికా షెడ్యూల్ ఉంటే, అది భారతీయ సినీ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలిచే అవకాశముంది.
ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. కథను ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ అందించగా, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లతో ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ అనుభూతిని ఇచ్చేలా రూపొందిస్తున్నారని సమాచారం. ‘వారణాసి’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఏప్రిల్ 7, 2027న విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంతర్జాతీయ స్థాయిలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే జార్జియా షెడ్యూల్ ముగిసిన తర్వాత అంటార్కిటికాలో చిత్రీకరణ ఉంటుందా? అన్న ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. మొత్తానికి ‘వారణాసి’ ఇండియన్ సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా మారుతుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.