యాదగిరిగుట్ట, ఫిబ్రవరి25: యాదగిరి కొండపై పంచనారసింహ రూపాల్లో వెలిసిన శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేష ఘట్టం బుధవారం పాంచరాత్రగమశాస్త్ర రీతిలో వైభవంగా జరిగింది. లక్ష్మీనరసింహస్వామివారి తిరు కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవదేవుడితో మహాలక్ష్మీ అమ్మవారి కమనీయ కల్యాణోత్సవ పర్వాలను భక్తజనులు కనులారా వీక్షించి తరించారు. యాదగిరిగుట్ట కొండ గుహాలో వెలిసిన భక్తజన బాంధవుడు యాదగిరీశుడి కల్యాణమహోత్సవ పర్వాలు రాత్రి 10:10 గంటలకు స్వయంభూ ప్రధానాలయ ఉత్తర మాడ వీధుల్లో నెలకొల్పిన ప్రత్యేక కల్యాణ వేదికపై వేద మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాల మధ్య కల్యాణ తంతు అత్యంత వైభవంగా సాగింది.
ముక్కోటి దేవతలు అహుతులుగా, చతుర్ముఖ బ్రహ్మాది దేవతల సమక్షంలో దేవ దేవుడు యాదగిరి నృసింహస్వామి లోక కల్యాణార్థం సముద్ర తనయ మహాలక్ష్మీ అమ్మవారి మెడలో రాత్రి 12:11 గంటల సింహాలగ్న సుముహూర్త శుభ ఘడియల్లో మాంగల్యధారణ చేశారు. పట్టువస్ర్తాలు, స్వర్ణ, వజ్రవైఢూరాలు, ముత్యాల ఆభరణాలతో నవవరుడిగా అలంకృతుడైన నరసింహస్వామి గజ వాహనంపై మండపానికి ఊరేగింపుగా రాగా, భక్తజన కోటికి సకల సంపదలను ప్రసాదించే మహాలక్ష్మీ అమ్మవారు పుష్పాలపల్లకిలో ఉత్తర మాడవీధుల్లో నిర్మించిన బ్రహ్మోత్సవ మండపంలోని కల్యాణ వేదికకు తీసుకువచ్చారు.
భక్త జనుల జయజయ ధ్వానాలు, ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, పారాయణం దారులు, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా మండల వేదిక వద్దకు చేరిన స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులను కల్యాణమండపంపై అధిష్టింపజేశారు. లక్ష్మీనరసింహస్వామి కల్యాణ వేడుకలను పాంచారాత్రగమశాస్త్రం రీతిలో దేవతల సైన్యాధ్యక్షుడు విష్వక్సేనుడికి తొలిపూజలతో శ్రీకారం చుట్టారు. స్వామి, అమ్మవార్లకు రక్షాసూత్రధారణ చేసిన అర్చకులు వేద ప్రాశస్త్యమైన మంత్రోచ్ఛరణలతో స్వామివారికి యజ్ఞోపవీత ధారణ తంతు నిర్వహించారు. దేవదేవుడు నరసింహస్వామి.. లక్ష్మీ అమ్మవారి తండ్రి సముద్రుడు పాదప్రక్షాళన చేసిన అనంతరం కన్యాదాన తంతును చేపట్టారు. వధూవరులు నరసింహస్వామి, మహాలక్ష్మీ అమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ఆలంకరించే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కల్యాణ మహోత్సవాన్ని ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు నిర్వహించారు.
శాస్ర్తోక్తంగా శ్రీరామ అలంకార సేవ
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం స్వామిని శ్రీరామ అలంకరణలో తీర్చిదిద్ది హనుమంత వాహనంపై వేదమంత్ర పఠనాలు, మంగవాయిద్యాల మధ్య ఊరేగించారు. అనంతరం రామచంద్రుడిని క్షేత్రపాలకుడైన హనుమంత వాహనంపై అధిష్టించారు. పశ్చిమ రాజగోపురం నుంచి ఉత్తర, తూర్పు, దక్షిణ మాడ వీధుల్లో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. జయ రామా.. జానకి రామా అంటూ జపం చేస్తూ భక్తులు తన్మయత్వం పొందారు. ఈ సందర్భంగా దేవాలయ ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు నారసింహుడిని శ్రీరాముడి సేవ విశిష్టతను భక్తులకు వివరించారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఈవో భవానీశంకర్, కలెక్టర్ హనుమంతరావు, డీఈవో దోర్బల భాస్కర్ శర్మ, ఆలయ ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు, భట్టర్ సురేంద్రాచార్యులు పాల్గొన్నారు.
కిక్కిరిసిన మాడ వీధులు
శ్రీలక్ష్మీనరసింహస్వామివారి వైభవోత్సవ కల్యాణంలో భక్తుల రాకతో ప్రధానాలయ తిరుమాడ వీధులు కిక్కిరిపోయాయి. ఉత్తర మాడ వీధులు, క్యూ కాంప్లెక్స్ భవనంపై భాగం భక్తుల కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు వీవీఐపీ, వీఐపీలు, ప్రజాప్రతినిధులు, కల్యాణంలో పాల్గొనే భక్తులు, సాధారణ భక్తులతో పూర్తిగా నిండిపోయాయి.
స్వామివారి సేవలో ప్రముఖులు
స్వామివారి తిరుకల్యాణమహోత్సవంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. దేవస్థానం తరఫున ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో భవానీ శంకర్ పట్టువస్ర్తాలు సమర్పించారు. అలాగే మరో మంత్రి పొన్నం ప్రభాకర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీమణి సుధాదేవి వర్మ, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, గుట్ట మున్సిపల్ చైర్పర్సన్ గుండ్లపల్లి వాణి, ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ తదితరులు పాల్గొని స్వామివారి కల్యాణ తంతును వీక్షించారు.
నేడు దివ్య విమాన రథోత్సవం
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజైన గురువారం ఉదయం 9 గంటలకు శ్రీమహావిష్ణు అలంకారంలో గరుడ వాహనంపై కల్యాణమూర్తి శ్రీలక్ష్మీనరసింహస్వామివారు దర్శనమివ్వనున్నారు.