BRS Leaders Strike | ధర్మారం, సెప్టెంబర్ 2 : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని అసెంబ్లీలో తీర్మానించడాన్ని నిరసిస్తూ మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు మేరకు మండలంలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గులాబీ శ్రేణులు కరీంనగర్- రాయపట్నం రహదారిపై బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీ నాయకులు నినాదాలు చేశారు. ఘోష్ కమిషన్ – ఫేక్ కమిషన్, కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డొస్తే అడ్డుకొని తీరుతాం. సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, వద్దురా నాయన కాంగ్రెస్ పాలన, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ నినదించారు. రాస్తారోకో చేయడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. రాస్తారోకో చేస్తున్న సమయంలో రహదారిపైనే మీడియాతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించగా.. అప్పటికే ధర్మారం ఎస్ఐ ఎం ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బలవంతంగా విరమింపచేయడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా పార్టీ నాయకులు పోలీసుల జులుం నశించాలి అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో బలవంతంగా పోలీసులు రాస్తారోకో చేస్తున్న నాయకులను విరమింపజేస్తున్న సమయంలో పోలీసుల పెనుగులాటలో నంది మేడారం సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి గాయపడ్డారు. పోలీసులు లాగుతున్న సమయంలో కార్యకర్తలు సైతం వెనుకకు లాడడంతో ఆయన ముక్కు వద్ద గాయమైంది.
ప్రాజెక్టుపై అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర..
అనంతరం రాస్తారోకో చేస్తున్న నాయకులను ఒక్కొక్కరిని బలవంతంగా పోలీసులు బయటికి తీసుకెళ్లారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులంతా కలిసి చౌరస్తాలో బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని శాంతియుత ప్రదర్శన చేశారు. అక్కడే పాక్స్ చైర్మన్ బలరాం రెడ్డితోపాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా బలరాం రెడ్డి మాట్లాడుతూ మాజీ సీఎం కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందగా దానిపై సీఎం రేవంత్ రెడ్డి మసిపూసి మారేడు కాయ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టుపై అవినీతి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేయడం సరైనది కాదని ఆయన ఆరోపించారు.
ప్రాజెక్టులో కుంగిన పిల్లర్లను మరమ్మతు చేయకుండా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పీసీ ఘోష్ కమిటీని ఏర్పాటు చేసి కాలయాపన చేస్తుందని ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో ఘోష్ కమిటీపై చర్చించకుండా మళ్లీ అదే ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం దారుణమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని.. ఇటీవల కాలం రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తుందని బలరాం రెడ్డి ధ్వజమెత్తారు.
కేసీఆర్ గురించి విషపు బీజాలు నాటే ప్రయత్నం..
బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ.. ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజలలో కేసీఆర్ గురించి విషపు బీజాలు నాటే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని ఆయన ఆరోపించారు. ప్రాజెక్ట్ అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌస్‌లు, 231 కిలోమీటర్ల సొరంగాలు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు, 141 టీఎంసీల స్టోరేజీ, 530 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోయడం, 240 టీఎంసీల నీటి ఉపయోగం, ఇంత పెద్ద ప్రాజెక్టులో 85 పిల్లర్లలో కేవలం 3 పిల్లర్లు కుంగడాన్ని రాద్దాంతం చేస్తున్నారని, కేసీఆర్‌ను బద్నాం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని శ్రీధర్ మండిపడ్డారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి, బుచ్చిరెడ్డి గుర్రం మోహన్ రెడ్డి, పాక్స్ వైస్ చైర్మన్ సామంతుల రాజ మల్లయ్య, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ చొప్పరి చంద్రయ్య , రైతుబంధు సమితి జిల్లా మాజీ సభ్యుడు పూస్కురు రామారావు, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి దొనికేని తిరుపతి గౌడ్, ఉపాధ్యక్షులు నాడెం శ్రీనివాస్, చింతల తిరుపతి, మాజీ ఎంపీటీసీ సభ్యులు తుమ్మల రాంబాబు, దాడి సదయ్య, మిట్ట తిరుపతి, బెల్లాల రోజా లక్ష్మణ ప్రసాద్, బొడ్డు రాములు, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎండి రఫీ, మాజీ సర్పంచులు జనగామ అంజయ్య సామంతుల జానకి శంకర్, పార్టీ మాజీ మండలాధ్యక్షుడు పెంచాల రాజేశం, మాజీ ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు కాంపల్లి చంద్రశేఖర్ ,ధర్మారం మాజీ ఉపసర్పంచ్ ఆవుల లత, పార్టీ మండల శాఖ అనుబంధ అధ్యక్షులు గుజ్జేటి కనకలక్ష్మి, దేవి నలినీకాంత్, సోషల్ మీడియా ప్రతినిధి సల్వాజి మాధవరావు, పార్టీ నాయకులు అయిత వెంకటస్వామి, ఆకారి సత్యం నేరెళ్ల చిన్న లచ్చయ్య, ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణు, దేవి అజయ్, దేవి రాజారాం, రాగుల చిన్న మల్లేశం, ఠాకూర్ హనుమాన్ సింగ్, ఎండి అజాం బాబా, సోన్నాయిల గంగయ్య, బైరి సురేష్, నార ప్రేమ్ సాగర్, సందనవేని రాజయ్య, తాళ్ల రాజయ్య , మహిళా నాయకురాలు కాంపల్లి ఆపర్ణ, మర్రి మమత, నెల్లి విజయ, దేవీ రాజేందర్, గంధం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
BRS leaders | కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం : బీఆర్ఎస్ నాయకులు
Heavy rains | తిమ్మాపూర్ మండలంలో భారీ వర్షం.. రాకపోకలకు అంతరాయం
Uttarakhand | ఉత్తరాఖండ్‌కు రెడ్ అలర్ట్.. 10 జిల్లాల్లో పాఠశాలలు మూసివేత