జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్‌ను ‘నీటి దొంగలు’ తోడేస్తున్నారు. జలాశయం ముఖద్వారం వద్ద మోటర్లు బిగించి.. జలదోపిడీకి పాల్పడుతున్నారు.. వందలాది ప్రైవేటు ట్యాంకర్లకు విక్రయిస్తూ..సొమ్ము చేసుకుంటున్నారు. డిమాండ్..దూరాన్ని బట్టి రేట్ ఫిక్స్ చేసి.. ఒక్కో ట్యాంకర్‌కు రూ. 1000 నుంచి రూ. 15వేల దాకా అమ్ముకుంటున్నారు. ఏకంగా అక్రమ ఫిల్లింగ్ స్టేషను ఏర్పాటు చేసి.. నీటిని ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. కిస్మత్పూర్ పరిధి శ్రీసాయి నగర్లో ఈ దందా యథేచ్ఛగా సాగుతున్నది. పెద్ద పైపుల ద్వారా రోజంతా నీటిని తోడేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ట్యాంకర్లతో నిండిపోతున్నాయి. జలమండలి నిఘా లేకపోవడంతో అక్రమంగా నీటిని సరఫరా చేస్తూ కొందరు సొమ్ము చేసుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు.
సిటీబ్యూరో, బండ్లగూడ, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : హిమాయత్‌సాగర్ రిజర్వాయర్ నుంచి నీటి దోపిడీ ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నది. కొందరు అక్రమార్కులు జలాశయం ముఖద్వారం వద్ద మోటర్లను బిగించి నీటిని తోడేస్తున్నారు. నిత్యం వందలాది ట్యాంకర్లకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా ట్యాంకర్ల రాకపోకలతో రద్దీగా మారుతున్నది. కిస్మత్పూర్ పరిధిలో హిమాయత్‌సాగర్ గేట్ల నుంచి విడుదలవుతున్న నీటిని తోడుతూ.. నగర శివారు ప్రాంతాల్లోని భవన నిర్మాణాలకు తరలిస్తున్నారు. ఏకంగా అక్రమ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసి నీటిని ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు.
ఇదంతా బహిరంగంగానే జరుగుతున్నది. ఇంత జరుగుతున్నా జలమండలి అధికారులు మాత్రం అటువైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే జలమండలి నిర్లక్ష్యంపై జంట జలాశయాల్లో అక్రమార్కులు మురుగు, సెప్టిక్ వ్యర్థాలు, నిర్మాణ వ్యర్థాలను పోస్తున్న ఘటనలు ఇటీవల వరుసగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా జలాశయంలోని నీటిని తోడేస్తూ ప్రైవేట్ ట్యాంకర్లకు విక్రయిస్తుండటం జలమండలి అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలుస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధి విస్తరించడంతో జలమండలిని కూడా దానికి సమాంతరంగా మార్చారు. అంత పెద్ద వ్యవస్థ ఉన్నా కూడా అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా..పట్టించుకోకపోవడంతో అధికారుల పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక్కో ట్యాంకర్‌కు..
హిమాయత్‌సాగర్ నుంచి మోటార్ల ద్వారా ఇష్టానుసారం నీటిని తోడుతూ వేలాది రూపాయలకు విక్రయిస్తున్నారు. దూరం, డిమాండ్‌ను బట్టి ఒక్కో ట్యాంకర్‌ను రూ.వెయ్యి నుంచి రూ.15 వేల దాకా విక్రయిస్తున్నారు. ఎండాకాలంలో జంబో ట్యాంకర్‌ను రూ.15 వేలకు పైగానే అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. దూరం ఎక్కువగా ఉండి డిమాండ్ ఎక్కువగా ఉంటే అంతకంటే ఎక్కువకే అమ్ముతున్నట్లు సమాచారం. రిజర్వాయర్ గేట్ల సమీపంలోని కిస్మత్పూర్ పరిధి శ్రీసాయి నగర్లో ఈ దందా యధేచ్ఛగా సాగుతున్నది. పెద్దపెద్ద పైపుల ద్వారా రోజంతా తోడుతుండటంతో ఆ ప్రాంతమంతా ట్యాంకర్లతో కిటకిటలాడుతున్నది. ఇప్పుడే ఇలా ఉంటే ఈనెలాఖరు నుంచి మే, జూన్ దాకా డిమాండ్ మరింత పెరుగుతుందని అక్కడి స్థానికులు చెబుతున్నారు.
ట్యాంకర్ల రాకపోకలతో ఆ ప్రాంతంలో తిరిగేందుకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని కిస్మత్పూర్ ప్రజలు పేర్కొంటున్నారు. అదే విధంగా ఈ ట్యాంకర్లను ఎక్కువ బహుళ అంతస్తుల భవనాలకు సరఫరా చేస్తుండటంతో బిల్డర్లు ధర విషయంలో రాజీ పడకుండా ఎక్కువ మొత్తం చెల్లిస్తున్నట్లు తెలుస్తున్నది. అక్రమార్కులు ఎండాకాలం వచ్చిందంటే అక్రమంగా నీటిని సరఫరా చేస్తూ లక్షలు దండుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై జలమండలి అధికారులు స్పందించి అక్రమ నీటి సరఫరాను అడ్డుకోవాలని కోరుతున్నారు. ట్యాంకర్ల రాకపోకలను నిరోధించాలని వేడుకుంటున్నారు. నీటిని కలుషితం చేయడం ఒకవైపు, రిజర్వాయర్ దగ్గరే మోటార్లతో విచ్చలవిడిగా తోడేస్తుండటం మరోవైపు జరుగుతుండటంపై నగర ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమాలను అరికట్టాలని కోరుతున్నారు.